• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YS SHARMILA NEW POLITICAL PARTY YS JAGANS SISTER LIKELY TO HIRE IPAC PRASHANTH KISHOR FOR TELANGANA ASSEMBLY POLLS STRATEGIST BA

షర్మిల ప్లాన్ మూమూలుగా లేదు.. రంగంలోకి మాస్టర్ మైండ్.. టీఆర్ఎస్, బీజేపీకి బిగ్ షాక్

షర్మిల ప్లాన్ మూమూలుగా లేదు.. రంగంలోకి మాస్టర్ మైండ్.. టీఆర్ఎస్, బీజేపీకి బిగ్ షాక్

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

జనవరి 8వ తేదీన ప్రశాంత్ కిశోర్ ప్రత్యేక విమానంలో వచ్చి అమరావతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఆ సందర్భంగానే వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు మీద చర్చించినట్టు తెలిసింది. ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడం ఖాయమైంది. పార్టీ పేరు, ఎజెండా, గుర్తులను త్వరలో ప్రకటించనున్నారు. చేవెళ్లలో పార్టీ పేరును ప్రకటించనున్నట్టు షర్మిల వెంట ఉన్న కొండా రాఘవరెడ్డి ప్రకటించారు. వైఎస్ షర్మిల ఈ రోజు నల్లగొండ జిల్లా నేతలతో చర్చించారు. తెలంగాణలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో చర్చించనున్నారు. అయితే, ఎన్నికలకు రంగంలోకి దిగడమే తన ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు వైఎస్ షర్మిల. కేసీఆర్‌కు మేలు చేసేందుకే ఆమె తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నారని, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నేతలు బీజేపీలోకి వెళ్లకుండా, రెడ్డి వర్గం నేతలను ఆకర్షించేందుకు షర్మిల కొత్త పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేయిస్తున్నారనే వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పెట్టబోయే పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఎజెండాగా, ‘రాజ్యన్న రాజ్యం’ అనే కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఆమె అడుగులు వేస్తున్నారు.

    తెలంగాణలో 2018లో ఎన్నికలు జరిగాయి. మళ్లీ 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మధ్యలో మున్సిపల్, చిన్న చిన్న ఎన్నికలు జరగనున్నాయి. అయితే, వైఎస్ షర్మిల ప్రధానంగా 2023 ఎన్నికలే టార్గెట్‌గా అడుగులు వేస్తున్నారు. అందుకోసం పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన ప్రశాంత్ కిశోర్‌ను సేవలను ఆమె తన కొత్త పార్టీ కోసం తీసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2019 ఎన్నికలకు ముందు జగన్‌ చేత పాదయాత్ర చేయించడం, జగన్‌ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా కార్యక్రమాలు, సోషల్ మీడియా క్యాంపెయినింగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా పెద్ద నెట్ వర్క్ నడిపారు ప్రశాంత్ కిశోర్. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న చరిష్మాను రెట్టింపు చేయడం, 2019లో ఆయన్ను అధికారంలోకి తీసుకురావడంలో ప్రశాంత్ కిశోర్ పాత్ర చాలా ముఖ్యమైందనేది ఎవరూ కాదనలేని విషయం. ఈ క్రమంలో 2023లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి కూడా ప్రశాంత్ కిశోర్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేయనున్నట్టు తెలిసింది.

    జనవరి 8వ తేదీన ప్రశాంత్ కిశోర్ ప్రత్యేక విమానంలో వచ్చి అమరావతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఆ సందర్భంగానే వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు మీద చర్చించినట్టు తెలిసింది. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న అభిమానులు, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు, కొత్త పార్టీ పెడితే ఎంతవరకు నెగ్గుకు రావొచ్చు, దానికి ఏమేం చేయాలనే అంశాలను పీకే, జగన్, షర్మిల చర్చించినట్టు సమాచారం. ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అక్కడ ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరగొచ్చని భావిస్తున్నారు. ఆ ఎన్నికలు పూర్తి కాగానే తెలంగాణకు వచ్చేస్తారని, షర్మిల కోసం పనిచేస్తారని తెలుస్తోంది. జగన్ తరహాలోనే షర్మిల కూడా తెలంగాణలో పాదయాత్ర చేయనున్నట్టు సమాచారం. ఆమె పాదయాత్ర మీద విలేకరులు ప్రశ్నించగా, ‘ఇప్పుడే చెప్పలేను.’ అని సమాధానం ఇచ్చారు. ఆమె ప్లాన్‌లో పాదయాత్ర కూడా ఉన్నట్టు భావిస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు