త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఓ దినపత్రికలో ఆదివారం వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. అయితే ఈ అంశం తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కొంత మంది వివిధ పార్టీల నేతలు ఈ అంశంపై స్పందించారు కూడా. అయితే ఈ కొత్త పార్టీ వార్తలపై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ విషయం తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందన్నారు. ఆ కథనాన్ని వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలుగా ఆమె అభివర్ణించారు. ఆ కథనాన్ని పూర్తిగా ఖండిస్తున్నానన్నారు.
ఏ పత్రిక అయినా.. ఏ ఛానెల్ అయినా ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పు అని అన్నారు. అది ఒక నీతిమాలిన చర్య అని అన్నారు. ఇలాంటి తప్పుడు రాసిన పత్రిక, చానెల్ మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి తాను వెనకాడబోనని వైఎస్ షర్మిల హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం షర్మిల ఓ ప్రకటన విడుదల చేశారు.

వైఎస్ షర్మిల విడుదల చేసిన ప్రకటన
ఇదిలా ఉంటే.. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాలు చేయనున్నట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ వి హనుమంతరావు స్పందించారు. షర్మిలకు విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు. షర్మిల పార్టీ పెట్టాలని భావిస్తే.. ఆంధ్రప్రదేశ్లో పెట్టడం మేలని ఆయన వ్యాఖ్యనించారు. తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని జోస్యం చెప్పారు. జగన్పై ప్రతీకారం తీర్చుకోవాంటే షర్మిల ఏపీలో పార్టీ పెట్టాలని సూచించారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి తానొక్కడినే వారసుడిగా జగన్ భావిస్తున్నారని వీహెచ్ అభిప్రాయపడ్డారు. షర్మిలలో కూడా ప్రవహిస్తున్నది వైఎస్ రక్తమేనని.. అందుకే ఆమె పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Published by:Nikhil Kumar S
First published:January 25, 2021, 19:41 IST