ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని పలు సర్వే సంస్ధలతో పాటు బెట్టింగ్ రాయుళ్లు సైతం నిర్దారిస్తున్న వేళ అధికారంలోకి రాగానే తనకు అవసరమైన టీమ్ ను జగన్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులతో పాటు పలువురు సీనియర్ల కోసం జగన్ అన్వేషణ సాగిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర పాలనా యంత్రాంగం సవ్యంగా నడవాలంటే సీఎస్ పదవి అత్యంత కీలకం. ఈ పదవిలో ప్రస్తుతం ఈసీ నియమించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంతో పాటు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఎల్వీ కీలక పదవుల్లో పనిచేశారు. గత సీఎస్ పునేఠాతో పోలిస్తే సీనియర్ కూడా. చంద్రబాబు విధేయుడు కావడంతో అప్పట్లో పునేఠాను తీసుకున్నారు. సరిగ్గా అదే కారణంతో ఈసీ ఎన్నికల వేళ ఆయన్ను తప్పించి ఎల్వీకి బాధ్యతలు అప్పగించింది. సీనియర్ కావడంతో పాటు ఐఏఎస్ ల్లోనూ మెజారిటీ మద్దతు ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ సీఎస్ గా కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మాజీ సీఎస్ అజేయ కల్లంకు కూడా కీలకమైన ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా సీఎస్ తో పాటు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగానూ, ఇతర కీలక విభాగాల్లో పనిచేసిన అనుభవం అజేయ కల్లానికి ఉంది. కొంతకాలంగా రాజధాని భూములతో పాటు ఇతర వ్యవహారాల్లో ఆయన చంద్రబాబు తీరుపై బహిరంగానే విమర్శలు సాగిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ భూ దోపిడీపై పలు చర్చా వేదికలు ఏర్పాటు చేయడంతో పాటు పుస్తకాలు కూడా రాసే పనిలో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో సాగిన వ్యవహారాలతో పాటు ఆర్ధికశాఖపై ఆయనకు గట్టి పట్టు ఉన్నందున ఆర్ధిక సలహాదారుగా జగన్ ఆయన్ను తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న మరో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సేవలను కూడా వాడుకునేందుకు జగన్ సై అన్నట్లు తెలుస్తోంది. గతంలో సీఎస్‌గా, భూపరిపాలనాశాఖ కమిషనర్ (సీసీఎల్ఏ) గా పనిచేసిన అనుభవం కూడా ఉన్న ఐవైఆర్ సేవలను రాజధాని భూముల వ్యవహారాల్లో వాడుకుంటారనే ప్రచారం సాగుతోంది.
రాష్ట్రంలో ప్రభుత్వం సవ్యంగా సాగాలంటే శాంతి భద్రతలు కూడా కీలకం. రాష్ట్రంలో పోలీసు బాస్ ఎవరన్న దాని ఆధారంగానే వివిధ పోలీసు విభాగాలు స్పందించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. దీంతో జగన్ తన ప్రభుత్వంలో డీజీపీగా ఠాకూర్ ను తప్పించి సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న జమ్మూ, కశ్మీర్ సీఆర్పీఎఫ్ డీజీ వీఎస్ కౌముది పేరు కూడా డీజీపీ పదవికి వినిపిస్తోంది. కౌముదిని జగన్ తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చి డీజీపీ బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదు. ఇదే కోవలో గతంలో వైఎస్ హయాంలో పలు కీలక విభాగాల్లో పనిచేసిన పీఎస్ఎర్ ఆంజనేయులు పేరు ఇంటిలిజెన్స్ చీఫ్ పదవికి వినిపిస్తోంది. ప్రస్తుతం బీఎస్ఎఫ్ డీజీగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు జగన్ కీలకమైన ఇంటిలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ జిల్లాలకు కలెక్టర్లుగా పనిచేస్తన్న వారు, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉన్నవారు సైతం జగన్ టీమ్ లో కీలకంగా వ్యవహరించబోతున్నారు. వీరిలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో ఐఏఎస్ లు ధనుంజయ్ రెడ్డి, ఎంటీ కృష్ణబాబు, పీవీ రమేష్ తో పాటు మరికొందరు అధికారులు ఉన్నారు. వీరిలో ధనుంజయ్ రెడ్డి పర్యాటకశాఖలో విధులు నిర్వర్తిస్తుండగా.. కృష్ణబాబు విశాఖ పోర్టు ట్రస్టు ఛైర్మన్ గా ఉన్నారు. జగన్ కోరితే వీరిద్దరినీ రాబోయే ప్రభుత్వంలో రాజధాని లేదా సీఎంవో వ్యవహారాల్లో కీలక బాధ్యతల్లో నియమించే అవకాశముంది. అలాగే ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ పీవీ రమేష్ కూడా రాష్ట్రానికి వచ్చే ఐఏఎస్ ల జాబితాలో ఉన్నారు. ఆయనకు కూడా ఆర్ధికశాఖలో కీలక బాధ్యతలు కట్టబెట్టవచ్చని ప్రచారం సాగుతోంది.
(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్18)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Ys jagan mohan reddy, Ysrcp