ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు పడిపడి నవ్వారు. పోలవరం మీద చర్చ సందర్భంగా ప్రదర్శించిన ఓ వీడియో వారిలో నవ్వులు పూయించింది. స్పీకర్ తమ్మినేని సీతారం ఏకంగా కళ్లలో నీరు వచ్చేంతగా నవ్వారు. ఇంతకీ విషయం ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు మీద అసెంబ్లీలో ఈరోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు జరిగిన పనులు, వైఎస్ హయాంలో జరిగిన పనులు, 2019 తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పనుల మీద సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కొంత డేటాను సభలో ప్రదర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఓ చిన్న పని చేసినా.. కూడా దాన్ని పెద్దగా పబ్లిసిటీ చేసుకునే వారని విమర్శించారు. ఓ సారి ఏకంగా రైతులను పోలవరం ప్రాజెక్టుకు తీసుకుని వెళ్తున్నామంటూ రూ.80 కోట్లు ఖర్చు పెట్టి తీసుకెళ్లారని, అక్కడ వారు ఏం చేశారో చూడాలంటూ జగన్ ఓ వీడియోను ప్రదర్శించారు. అందులో ‘జయము జయము చంద్రన్న.. నీకు తిరుగు లేదు చంద్రన్న’ అంటూ కొందరు మహిళలు చంద్రబాబును పొడుగుతూ పాటలు పాడుతున్నారు. ఆ వీడియో వచ్చినంత సేపు సభలో వైసీపీ ఎమ్మెల్యేలు నవ్వుతూ కనిపించారు. సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సహా అందరూ పడి పడి నవ్వారు.
అంతకు ముందు పోలవరం మీద చర్చ సందర్భంగా టీడీపీ సభ్యులు పోడియం ఎదుట నిరసన తెలిపారు. దీంతో 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి ఒక రోజు సస్పెండ్ చేశారు. వరుసగా మూడో రోజు కూడా సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల మీద సస్పెన్షన్ వేటు పడింది.