ఒత్తిడిలో జగన్ సర్కార్.. ఇదే కారణం

సీఎం వైఎస్ జగన్

ఏపీలో ఇసుక కొరత పేదల జీవితాల్లో చీకట్లు నింపుతోంది. నెలల తరబడి ఇసుక కొరత కొనసాగుతుండటంతో అన్నిచోట్లా భవన నిర్మాణాలు నిలిచిపోయాయి.

 • Share this:
  ఏపీలో ఇసుక కొరత అంతకంతకూ తీవ్రమవుతోంది. దీంతోపాటే విపక్షాల ఆందోళన కూడా ఉధృతమవుతోంది. నదుల్లో వరద ప్రవాహం తగ్గకపోవడం, ఇసుక లభ్యత లేకపోవడంతో నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లక్షలాది కార్మికులకు పూట గడవటమే కష్టమైపోతోంది. దీంతో సహజంగానే ఈ పరిస్ధితిని రాజకీయ లబ్ది కోసం వాడుకునేందుకు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇసుకపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ నవంబర్ మొదటివారంలో విశాఖలో కవాతుకు పిలుపునిచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్.... తాజాగా కేంద్రం జోక్యం చేసుకోవాలని ట్వీట్ కూడా చేశారు. అటు బీజేపీ, టీడీపీ కూడా రాష్ట్రంలో వివిధ రూపాల్లో ఎక్కడికక్కడ ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి.

  ఏపీలో ఇసుక కొరత పేదల జీవితాల్లో చీకట్లు నింపుతోంది. నెలల తరబడి ఇసుక కొరత కొనసాగుతుండటంతో అన్నిచోట్లా భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. నిర్మాణ సంస్ధలు నష్టాల్లో కూరుకుపోతుండగా.. కార్మికులు రోజువారీ కూలీ దొరక్క అప్పుల పాలవుతున్నారు. వీరిలో కొందరు బాధలు పడలేక బలవన్మరణాలకు సైతం పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో వెంకటేష్ అనే కూలీ సెల్ఫీ వీడియో తీసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇసుక కొరత సెగ గుంటూరు జిల్లాలో పర్యటించిన అమాత్యులకు సైతం తగిలింది. గంటూరు వెళ్లిన మంత్రులు బొత్స, మోపిదేవిని ముట్టడించేందుకు కార్మికులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని చివరి నిమిషంలో దారి మళ్లించారు.. పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా మారుతుండటంతో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్ధితి నెలకొంటోంది. దీంతో విపక్షాలు ఇసుక వ్యవహారాన్ని సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి. ఇసుక కొరతపై ప్రభుత్వ తీరును ఎక్కడికక్కడ ఎండగడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. విశాఖపట్నంలో వచ్చే నెల 3న కవాతుకు పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందిపెడుతున్న ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఏకంగా కేంద్రాన్నే కోరారు. దీంతో సహజంగానే జనసేనాని ఆందోళనలకు సాధారణ జనంలో మద్దతు పెరుగుతోంది.

  అదే సమయంలో టీడీపీ, బీజేపీ కూడా ఇసుక కొరతను ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తూ నిత్యం విమర్శలకు దిగుతున్నాయి. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే ఇసుక కొరత సమస్య తీవ్రమవుతోందని, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. రోజూ ఏదో విధంగా నిరసనలకు దిగుతున్న టీడీపీ, బీజేపీ నేతలు, అటు సామాజిక మాధ్యమాలలోనూ పోరాటం సాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఎన్నడూ లేని స్ధాయిలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. గత కేబినెట్ భేటీలో స్వయంగా సీఎం జగన్ ఇసుక కొరతపై నిస్సహాయత వ్యక్తం చేయడం కూడా విపక్షాలకు కలిసివస్తోంది. రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు సరైన అస్త్రం కోసం ఎదురుచూస్తున్న విపక్షాలకు ఇసుక రూపంలో వైసీపీ ప్రభుత్వం పెద్ద అవకాశమే ఇచ్చినట్లయింది. మరోవైపు నదుల్లో వరద ప్రవాహాలు ఇంకా తగ్గకపోవడంతో కనీసం మరో రెండువారాలు గడిస్తే కానీ ఇసుక లభ్యత ప్రారంభమయ్యేలా లేదు. ఈ ఏడాది చివరి నాటికి మాత్రమే ఇసుక పూర్తిస్ధాయిలో లభ్యమవుతుందన్న వార్తలు ఇప్పుడు రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

  (సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)

  Video: కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి

  Published by:Ashok Kumar Bonepalli
  First published: