YS JAGAN WILL WIN IN AP ELECTION HOW MUCH SALARY HE WILL TAKE AS A CM SB
జగన్ సీఎం అయితే ... ఆయన జీతం ఎంతో తెలుసా ?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
జీతం విషయంలో జగన్ తండ్రి వైఎస్ఆర్ను ఫాలో అవుతున్నట్లు సమాచారం. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలానే చేసి ఇంత జీతమే తీసుకున్నారని రాజకీయ ప్రముఖులు చెబుతున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో గెలుస్తారనే ఊహాగానాలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా సర్వేలు కూడా జగన్ పార్టీయే గెలిచి తీరుతుందని తేల్చేశాయి. అటు వైసీపీలో కూడా ఇదే ధీమా కనిపిస్తోంది. అందుకే కొందరు నేతలు అప్పుడే పదవులపై జగన్ వద్దకు రాయబారాలు కూడా చేసినట్లు సమాచారం. అయితే ఒకవేళ అన్నీ అనుకూలించి జగన్ సీఎం అయితే... ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే...జగన్ ఒక్క రూపాయి జీతాన్ని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇదే విషయంపై కొంతమంది పార్టీ నేతలు, సన్నిహితుల వద్ద చర్చించినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొనే జగన్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం.
ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉందని తెలుస్తోంది. వచ్చేది ఎవరి ప్రభుత్వమైనా.. ఆర్థిక కష్టాలు, సవాళ్లు తప్పవని చెబుతున్నారు. దీంతో జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు అవసరమైన సీఎం హోదాలో ఆయన జీతం కూడా వదులుకునేందుకు సిద్ధమవుతున్నాట్లు సమాచారం. దీంతో జగన్ సీఎం అయితే కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఆర్థిక పరిస్థితులను సరిదిద్దడానికి ఆ శాఖలో చాలాకాలం పాటు పనిచేసి, పదవీ విరమణ చేసిన కొందరు ఐఎఎస్ అధికారులను సలహాదారుగా నియమించుకోవాలని జగన్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. రూపాయి జీతం విషయంలో జగన్ తండ్రి వైఎస్ఆర్ను ఫాలో అవుతున్నట్లు సమాచారం. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలా ఒక రూపాయి జీతం తీసుకునేవారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
అయితే చంద్రబాబు మత్రం ప్రస్తుతం సీఎంగా దాదాపు రెండున్నర లక్షలు జీతం తీసుకుంటున్నారట. దేశంలో అధిక మొత్తంలో వేతనాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన మూడో స్థానంలో ఉన్నారట. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో మొదటి స్థానంలో ఉన్నారు. కేసీఆర్ ఏకంగా రూ.4,21,000 తీసుకుంటున్నారట. మొదటి స్థానం కేసీఆర్ ఆక్రమించగా, రెండో స్థానం ఉత్తరాఖండ్ సీఎం నెలకు రూ.2,50,000 చొప్పున జీతం తీసుకుంటున్నారు. మూడో స్థానంలో చంద్రబాబు రూ.2,40,000 తీసుకుంటున్నారు. ఇకపోతే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ మరణించిన జయలలిత ఒక్కరూపాయి తీసుకుంటుండగా, పశ్చిమ బెంగాల్ దీదీ అసలు అది కూడా పుచ్చుకోవట్లేదు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.