• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YS JAGAN TO WRITE LETTERS TO NEUTRAL PEOPLE IN ANDHRA PRADESH FOR SUGGESTIONS FOLLOWING TDP OLD STRATEGY AK

చంద్రబాబు బాటలో జగన్... తటస్థులకు లేఖలు... అసలు వ్యూహం ఇదే ?

చంద్రబాబు బాటలో జగన్... తటస్థులకు లేఖలు... అసలు వ్యూహం ఇదే ?

చంద్రబాబు, జగన్(ఫైల్ ఫోటో)

రాబోయే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్న వైసీపీ... ఇరు పార్టీలకు సమాన దూరం పాటిస్తున్న వారిని ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్ వేసింది. వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని, అందుకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని మేథావులు, తటస్ధులకు లేఖలు రాయబోతున్నారు వైఎస్ జగన్.

  • Share this:
    (సయ్యద్ అహ్మద్, న్యూస్18 ప్రతినిధి, విజయవాడ)

    వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్న వైసీపీ... ఇరు పార్టీలకు సమాన దూరం పాటిస్తున్న వారిని ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్ వేసింది. వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని, అందుకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని మేథావులు, తటస్ధులకు లేఖలు రాయబోతున్నారు వైఎస్ జగన్. ఎవరెవరికి లేఖలు రాయాలనే అంశంపై ప్రశాంత్ కిశోర్ టీమ్ ఇప్పటికే జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

    నిజానికి వైసీపీ అధినేత అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని గతంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అనుసరించారు. 1999 ఎన్నికల సందర్భంగా ఈ రకమైన వ్యూహాన్ని అమలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు... అప్పట్లో మళ్లీ అధికారంలోకి రాగలిగారు. దీంతో ఈ ఫార్ములాను వైఎస్ జగన్ ఫాలో కానున్నట్టు తెలుస్తోంది. పార్టీ గెలుపునకు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పనకు సూచనలు, సలహాలు కోరుతూ లేఖలు రాయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు.

    తటస్థులు, మేధావులు, సీనియర్ రాజకీయ నేతల నుంచి సలహాలు స్వీకరించాలని భావిస్తున్న వైసీపీ... వారిని పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా ప్రజల్లో పార్టీ ఇమేజ్ మరింతగా పెరుగుతుందని వైఎస్ఆర్‌సీపీ భావిస్తోంది. అయితే కాంగ్రెస్, టీడీపీ మధ్య పొత్తు లేదని తెలిసిన తరువాతే వైసీపీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే వాదనలు కూడా వినిపిస్తోంది.

    ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అనేక మంది సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారని... వారిని పార్టీలోకి చేర్చుకునేందుకే వైసీపీ ఈ రకమైన ఎత్తు వేసిందనే టాక్ వినిపిస్తోంది. ముందుగా కొందరు సీనియర్ నేతలకు లేఖలు రాసి... ఆ తరువాత వారితో సమావేశం కావాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వారి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుంటే... వారిలో ఎక్కువమంది పార్టీలోకి వస్తారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి తటస్థులకు లేఖల పేరుతో వైసీపీ వేసిన రాజకీయ ఎత్తుగడకు విరుగుడుగా టీడీపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో చూడాలి.
    First published: