జగన్ క్యాంప్ ఆఫీస్‌గా వైసీపీ కార్యాలయం...పార్టీ ఆఫీస్ మళ్లీ షిఫ్ట్

AP Election Results: వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణంలోకి మీడియాతో పాటు పార్టీ నేతలను సైతం అనుమతించడం లేదు.

news18-telugu
Updated: May 24, 2019, 3:41 PM IST
జగన్ క్యాంప్ ఆఫీస్‌గా వైసీపీ కార్యాలయం...పార్టీ ఆఫీస్ మళ్లీ షిఫ్ట్
వైఎస్ జగన్
  • Share this:
'జగన్ అనే నేను'..అనేందుకు వైసీపీ అధినేత సిద్ధమవుతున్నారు. మే 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఐతే సీఎం పగ్గాలు చేపట్టబోతున్న వైఎస్ జగన్ పలు కీలక మార్పులకు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకూ తాడేపల్లిలోని తన ఇంటి ప్రాంగణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇకపై సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చబోతున్నారు.. దీంతో విజయవాడలోని సిటీ ఆఫీసును తాత్కాలికంగా కేంద్ర కార్యాలయంగా వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీలో వైసీపీ ప్రభంజనం నేపథ్యంలో కొత్తగా అధికారం చేపట్టబోతున్న కాబోయే సీఎం వైఎస్ జగన్.. అధికారిక నివాసం, పార్టీ కార్యాలయం వేర్వేరుగానే ఉండాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నుంచి ఇన్నాళ్లూ పార్టీ నేతలకు అందుబాటులో ఉన్న వైఎస్ జగన్... తాజాగా ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలోని తాడేపల్లికి మకాం మార్చారు. ఎన్నికల్లో గెలిచి సీఎం కానున్న నేపథ్యంలో అటు అధికారిక కార్యకలాపాలను, వైసీపీ అధ్యక్షుడిగా ఇటు పార్టీను కూడా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పార్టీతో పాటు ప్రభుత్వంపైనా విమర్శలు తప్పవు. అందుకే ముందుజాగ్రత్త చర్యగా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అన్న సంకేతాన్ని నేతలకు పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తాడేపల్లిలోని జగన్ నివాస ప్రాంగణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని మరో చోటికి మార్చేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంగా ఉన్న భవనాన్ని ఇకపై సీఎం క్యాంపు కార్యాలయంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. జగన్ నివాసం, వైసీపీ కేంద్ర కార్యాలయం ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల జగన్ ను కలిసేందుకు నిత్యం వచ్చే నేతలు, కార్యకర్తలతో పాటు ఇతరుల నుంచి భద్రతా సమస్యలు ఉంటాయని నిఘా వర్గాలు సూచించినట్లు తెలిసింది. దీంతో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణంలోకి మీడియాతో పాటు పార్టీ నేతలను సైతం అనుమతించడం లేదు.

తాడేపల్లిలోని జగన్ నివాస ప్రాంగణం నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని తరలించాలని నిర్ణయించిన నేపథ్యంలో మరో అనువైన స్ధలం లేదా భవనం కోసం అన్వేషణ సాగిస్తున్నారు. గత ప్రభుత్వం వివిధ పార్టీలకు రాజధానిలో అధికారికంగా పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్ధలాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం కోసం మూడున్నర ఎకరాలు, మిగతా ప్రాంతీయ పార్టీలకు అర ఎకరం ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశముంది. టీడీపీతో సమానంగా మూడున్నర ఎకరాల స్ధలం తీసుకుని అమరావతిలోని ఏదో ఒక చోట కేంద్ర కార్యాలయం నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది అప్పటివరకూ ప్రస్తుతం విజయవాడ ఎంజీ రోడ్డులో ఉన్న జిల్లా వైసీపీ కార్యాలయాన్నే కేంద్ర కార్యాలయంగా వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటివరకూ హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయం లేదా జగన్ నివాసం నుంచే వైసీపీ కార్యకలాపాలు సాగించిన జగన్‌కు ప్రస్తుతం సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో నివాసంతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయం విషయంలోనూ జగన్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా తక్కువ ఖర్చుతో ఎలాంటి మార్పులు చేయాలనే అంశంపై జగన్ దృష్టిసారిస్తున్నట్లు తెలిసింది.

(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 కరెస్పాండెంట్, విజయవాడ)
First published: May 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు