• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • YS JAGAN SISTER YS SHARMILA SLAMS CM KCR IN MEDAK YSR FANS MEETING IN HYDERABAD SK

YS Shramila: సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల.. మరోసారి సంచలన వ్యాఖ్యలు

YS Shramila: సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల.. మరోసారి సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల, సీఎం కేసీఆర్

మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారికి ఇంకా న్యాయం జరగలేదని సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. అందుకే వారు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు.

 • Share this:
  తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్ అభిమానులతో వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ హాట్ టాపిక్‌గా మారారు. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్‌ను మరోసారి టార్గెట్ చేశారు వైఎస్ షర్మిల. బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ జిల్లాగా చెప్పుకునే మెదక్‌లో 20 కరువు మండలాలు ఉండడం బాధాకరమని షర్మిల విమర్శించారు. పటాన్ చెరు ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుందని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారికి ఇంకా న్యాయం జరగలేదని సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అందుకే వారు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితుల భూములను లాక్కుంటున్నారని విరుచుకుపడ్డారు.

  టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న ఆమె.. యువతకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఇక మెదక్ జిల్లా... పాటకు ప్రాణం, విప్లవానికి ఊపిరిపోసిన గద్దర్ పుట్టిన గడ్డ అని కొనియాడారు వైఎస్ షర్మిల. ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా మెదక్ జిల్లాకు 5.19 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావించారని..దానిని రీడిజైన్ చేసిన నాయకులు, ఇప్పటి వరకు ఏం చేశారో ఎవరికీ తెలియదని విమర్శలు గుప్పించారు. మెదక్ జిల్లా వైయస్ఆర్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో కొండా రాఘవ రెడ్డి, పిట్టా రామ్ రెడ్డి, ఇందిరా శోభన్ , వాడుక రాజగోపాల్, గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి, బి.సంజీవ రావు, ఆర్ చంద్రశేఖర్ , తడాకా జగదీశ్వర్ గుప్త, బాలకృష్ణ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, ఎం.విజయ్, సంజీవ రెడ్డి పాల్గొన్నారు.

  ఖమ్మంలో ఏప్రిల్ 9న సంకల్ప సభను తలపెట్టారు వైఎస్ షర్మిల. కానీ కరోనా కారణంగా పోలీసులు ఆంక్షలు విధించారు. కనీసం లక్ష మందికి తగ్గకుండా జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు. ఐతే తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. జనం గుంపులు గుంపులుగా ఉండకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ వంటి పండుగలపైనా ఆంక్షలు విధించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని.. లేదటే భారీగా జరిమానాలు విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొత్తంగా ఏప్రిల్ 30 వరకు తెలంగాణ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈ క్రమంలో కోవిడ్ ఆంక్షల ప్రభావం షర్మిల సభపై పడే అవకాశముంది.

  కాగా, ఏప్రిల్‌ 9న వైఎస్‌ షర్మిల లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసంలో ఉదయం 8 గంటలకు ఖమ్మం బయలుదేరుతారు షర్మిల. లక్డీకపూల్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ మీదుగా వెళ్లి హయత్‌నగర్ రిసీవింగ్ పాయింట్‌లో అభిమానులను పలకరిస్తారు. అనంతరం చౌటుప్పల్‌, నకిరేకల్‌, సూర్యాపేట మీదుగా వెళ్లి చివ్వెంల తహశీల్దార్‌ కార్యాలయం సమీపంలో లంచ్‌ చేస్తారు. అక్కడి నుంచి బయలుదేరి ఖమ్మం జిల్లాలోని నాయకన్‌గూడెం నుంచి భారీ ర్యాలీగా ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మంలోని పెవిలియన్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వేదిక నుంచి తొలిసారిగా ప్రజలనుద్దేశించి తన రాజకీయ సంకల్పాన్ని ప్రకటిస్తారని ఆమె టీమ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఆ బహిరంగ సభ వేదికగా పార్టీ పేరు.. జెండా.. అజెండా.. విధి విధానాలను ప్రజల ముందుంచుతారని వెల్లడించారు.
  Published by:Shiva Kumar Addula
  First published: