ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనవరి 9న మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఏపీలోని ప్రధాన రాజకీయపార్టీలైన టీడీపీ, వైసీపీలు వివిధ కారణాల వల్ల బుధవారం సందడి చేయబోతున్నాయి. టీడీపీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్‌లోని మొదటి భాగం కథానాయకుడు సినిమా రేపు ధియేటర్లలోకి రానుండగా... ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర జనవరి 9న ముగియనుంది. దీంతో ఈ రెండు సందర్భాలు ఏపీలోని రెండు ప్రధాన పార్టీలకు కీలకమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర బుధవారంతో ముగియనుంది. మూడు వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్... రాష్ట్రంలోని మెజార్టీ నియోజకవర్గాలను చుట్టేశారు. అధికారంలోకి వచ్చేందుకు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి తరహాలోనే పాదయాత్ర చేపట్టిన జగన్మోహన్ రెడ్డి... రేపటి ముగింపు సభలో ఎలాంటి కీలక ప్రకటన చేస్తారో అనే అంశం ఆసక్తికరంగా మారింది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాలను చెప్పడంతో పాటు... తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను కూడా వైఎస్ జగన్ ప్రకటించే అవకాశం ఉందని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ నిజంగానే తమ పార్టీకి సంబంధించి అభ్యర్థులను ప్రకటిస్తారా ? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఇక అధికార పార్టీ బుధవారం విడుదల కాబోయే ఎన్టీఆర్ సినిమా కోసం ఎదురుచూస్తోంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానాయకుడు, మహానేత ఎన్టీఆర్ బయోపిక్... తమకు కచ్చితంగా ఎంతోకొంత పొలిటికల్ మైలేజీ ఇస్తుందనే భావనలో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడులో కేవలం సినిమాకు సంబంధించిన ప్రస్తావన మాత్రమే ఉంటుందనే టాక్ ఉన్నా... ఈ సినిమా విడుదలను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించుకున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనేక జిల్లాల్లో ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే... అది సినిమాతో పాటు టీడీపీకి కూడా ప్లస్ అవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తానికి జగన్ పాదయాత్ర ముగింపు, ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల ఒకే రోజు ఉండటంతో... టీడీపీ, వైసీపీలకు జనవరి 9 బిగ్ డేగా మారనుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bala Krishna Nandamuri, NTR Biopic, Tdp, Ys jagan, Ysrcp