ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 30న ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయనున్నారు. గవర్నర్ నరసింహన్.. జగన్ మోహన్ రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. 30వ తేదీ మధ్యాహ్నం 12.23 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని గవర్నర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ 29వ తేదీ సాయంత్రానికే విజయవాడ చేరుకుంటారు. 30వ తేదీన ప్రమాణస్వీకారానికి హాజరవుతారు.
జగన్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం జారీ చేసిన ప్రకటన
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఈ స్టేడియంలో 35వేల మంది గ్యాలరీల్లో కూర్చొనే అవకాశం ఉండడం, దిగువన మరో 20వేల మంది కూర్చొనే వెసులుబాటు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తంగా 50వేల మందికి పైగా కూర్చొనే వెసులుబాటు ఉండటంతో ఈ మేరకు అక్కడే ప్రమాణస్వీకారోత్సవం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది.
ఈకార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఇతర ఆహ్వానితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చూడాలని ఏర్పాట్లు విషయంలో ఎంతమాత్రం రాజీపడవద్దని చీఫ్ సెక్రటరీ స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్య రాకుండా తగిన వాహనాల పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక సైనేజి బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకూ ప్రత్యేక బస్సులు ద్వారా ప్రజలను తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎస్ చెప్పారు.ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనే వారిందరికీ తగిన తాగనీరు, స్నాక్స్ వారు కూర్చున్న చోటే అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి దృష్ట్యా స్టేడియంలో ఎసిలు, కూలర్లు ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.