Amma Vodi: ‘అమ్మఒడి అమలైతే, ఎస్సీ, ఎస్టీలకు మిగతా పథకాలు ఆపేస్తారా?’

ఎస్సీ, ఎస్టీలకు అందాల్సిన ప్రయోజనాలన్నింటినీ, నవరత్నాల పేరుతో జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు.

news18-telugu
Updated: October 8, 2020, 3:25 PM IST
Amma Vodi: ‘అమ్మఒడి అమలైతే, ఎస్సీ, ఎస్టీలకు మిగతా పథకాలు ఆపేస్తారా?’
జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభోత్సవంలో సీఎం జగన్
  • Share this:
(రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్ 18)

గత ప్రభుత్వం అమలుచేసిన పాత పథకానికి రంగులద్ది, జగనన్న విద్యాకానుకపేరుతో జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని, అది దేశంలో ఎక్కడా లేదన్నట్లుగా ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవాచేశారు. గురువారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం గతంలో విద్యాసంవత్సరం ప్రారంభమవ్వడానికి వారం ముందే, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ రెండుజతలు, షూస్ అందించిందన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం బెల్టు, బ్యాగ్, టై, వర్క్ బుక్స్ ని అదనంగా అందించి, గొప్పలు చెప్పుకుంటోందన్నారు. 8, 9 తరగతి చదివే విద్యార్థినుల కోసం టీడీపీ ప్రభుత్వం రూ.149కోట్లు ఖర్చుచేసి, సైకిళ్లు అందించిందని, ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని విద్యార్థులకు ఇవ్వకుండా, మూలనపడేసిందన్నారు. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త పథకం కిందైనా సైకిళ్లు అందచేస్తే బాగుండేదని ఆనందబాబు అభిప్రాయపడ్డారు.

నవరత్నాల్లోని పథకాలద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న నక్కా, ప్రభుత్వంలోని నేతలు కూడా దీనిపై ఆలోచన చేయాలన్నారు. అమ్మఒడి పథకం కింద ఇంటికొక విద్యార్థికి రూ.15వేలచొప్పున లబ్దిచేకూర్చిన ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు లభించే ప్రీ - పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులను అందకుండా చేసిందన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు లభించే స్కాలర్ షిప్పులను అమ్మఒడి కారణంగా ఆయా వర్గాల విద్యార్థులు కోల్పోతున్నారని, ఇది నిజమోకాదో ప్రభుత్వంలోని దళిత మంత్రులు కూడా ఆలోచించాలని మాజీ మంత్రి సూచించారు. బెస్ట్ అవేలబుల్ పాఠశాలలను చంద్రబాబునాయుడు 1995లో ప్రవేశపెట్టారని, కార్పొరేట్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో, వారికి కూడా మంచి ఉన్నత విద్యను అందించాలని, వివక్షను రూపుమాపాలనే లక్ష్యంతో దాన్ని తీసుకువచ్చారన్నారు. ఎస్టీలు 17వేల మంది, ఎస్సీలు 30వేల మందికి పైగా బెస్ట్ అవేలబుల్ స్కీమ్ కింద లబ్ది పొందుతున్నారన్నారు.

జగన్ ప్రభుత్వం అమ్మఒడి పథకం తెచ్చామని చెప్పి, బెస్ట్ అవేలబుల్ పథకాన్ని రద్దుచేసిందన్నారు. కార్పొరేట్ స్కూళ్లలో విద్యనభ్యసించే దళిత విద్యార్థులు నష్టపోతున్న విధానంపై ప్రభుత్వంలోని దళిత నేతలు ఆలోచించాలన్నారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంపై 2013న జీవో ఇచ్చారని, ఆ ఏడాది కేవలం 6గురు మాత్రమే విదేశాలకు వెళ్లారని ఆనందబాబు చెప్పారు. చంద్రబాబు రాగానే 2014లో ఆ పథకాన్ని ఎస్సీ, ఎస్టీలు సమర్థవంతంగా వినియోగించుకునేలా చేశారన్నారు. 15 దేశాల్లో ఎంబీబీఎస్, ఇతర పీజీ కోర్సులు చదివేలా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.15లక్షలు అందించిన ఘనత చంద్రబాబునాయుడికే దక్కుతుందన్నారు. జగన్ ప్రభుత్వం ఆ పథకాన్ని కూడా రద్దుచేసిందని, దానివల్ల విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. వీటన్నింటిపై వైసీపీలోని దళితనేతలు, దళిత మేథావులు, ప్రజాసంఘాల వారు ఆలోచన చేయాలని ఆనందబాబు విజ్ఞప్తిచేశారు.

సాంఘిక సమానత్వం లేక బాధపడుతున్న ఎస్సీ, ఎస్టీలకు అందాల్సిన ప్రయోజనాలన్నింటినీ, నవరత్నాల పేరుతో జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కిన నిజాన్ని గ్రహించాలని నక్కా ఆనంద్ బాబు అన్నారు. న్యాయంగా, రాజ్యంగ పరంగా ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన ప్రయోజనాలను హరిస్తున్న జగన్ ప్రభుత్వం, వారికి మేలు కలిగించే 11 పథకాలను రద్దు చేసిందన్నారు. వాటి వివరాలను కూడా త్వరలోనే తెలియ చేస్తామన్నారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వ, అడుగడుగునా వారిని మోసగిస్తూ, వారిజీవితాలను నాశనం చేస్తోందన్నారు. దీనిపై దళితసంఘాలు, విద్యార్థి సంఘాలు ఆలోచించాలని ఆనందబాబు కోరారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 8, 2020, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading