మందుబాబులకు చేదువార్త.. త్వరలో కిక్కు దిగుతుంది..

అక్టోబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

news18-telugu
Updated: July 20, 2019, 6:08 PM IST
మందుబాబులకు చేదువార్త.. త్వరలో కిక్కు దిగుతుంది..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మద్యం నియంత్రిస్తామంటూనే మరో వైపు ధరలను విపరీతంగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. చీప్‌ లిక్కర్‌ నుంచి హై క్లాస్‌ బ్రాండ్‌ వరకు ఆల్‌ ప్రీమియం బ్రాండ్స్‌ ధరలు అక్టోబర్‌ నుంచి మోతమోగనున్నాయి. అక్టోబర్‌ నుంచి ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి మద్యం దుకాణాలను నిర్వహించనుంది. అందుకోసం విధివిధానాలను ఖరారు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. 20శాతం మద్యం షాపులకు కోత విధించనున్నారు. మిగిలిన మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించనుంది. ఈ విధానం ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిసింది. మద్యం ధరల ఎమ్మార్పీని భారీగా పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఐఎంఎల్‌ డిపో ద్వారా అందిస్తున్న ప్రతి బ్రాండ్‌ మద్యానికి క్వార్టర్‌కు కనీసం రూ.50కి పైనే పెంచనున్నారు. అన్ని ప్రీమియం బ్రాండ్లతో పాటు చీప్‌ లిక్కర్‌ ధర కూడా భారీగా పెరగనుంది. బార్‌లకు మాత్రం 2022 మార్చి 31 వరకు ఎటువంటి మార్పు ఉండదు. ఆ తరువాతే వాటిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు వైన్‌షాపులలో మద్యం రేట్లను భారీగా పెంచే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్‌ అధికారి తెలిపారు. జిల్లాల్లో మద్యంషాపులు తగ్గించడంతో, మద్యం రేట్లు పెంచడంతో కాపుసారా, గుడుంబా భారీగా సరఫరా అయ్యే అవకాశం ఉంది. ఇక ఎక్సైజ్‌శాఖ అధికారులు వీటి నియంత్రణ కోసం పని చేయాల్సి ఉంటుంది. మద్యం షాపుల నిర్వహణ ద్వారా ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి షాపులో ముగ్గురు నలుగురు చొప్పున ఉద్యోగాలు కల్పించ‌నున్నారు. వీరితో పాటు ప్రతి షాపుకు ఒక సూపర్‌ వైజర్‌ను నియ మించనున్నట్లు తెలుస్తోంది.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...