ఎఫ్‌డీసీ చైర్మన్‌గా అలీ.. జగన్ ఉద్దేశం అదేనా?

Comedian Ali | టీడీపీ ప్రభుత్వ హయాంలో అంబికా కృష్ణ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా వ్యవహరించారు.

news18-telugu
Updated: July 29, 2019, 9:28 PM IST
ఎఫ్‌డీసీ చైర్మన్‌గా అలీ.. జగన్ ఉద్దేశం అదేనా?
అలీతో జగన్
  • Share this:
మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ తీర్ధం పుచ్చుకుని, ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేసిన సినీ నటుడు అలీకి ఏపీ పిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి దక్కనుంది. ఇప్పటికే అలీకి ఈ మేరకు హామీ ఇచ్చిన జగన్... తాను జెరూసలేం యాత్ర నుంచి రాగానే దీనిపై అధికారిక ఉత్తర్వులు కూడా విడుదల చేయనున్నారు. ఏపీలో వైసీపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడం వెనుక సినీ రంగానికి చెందిన అలీ, పృధ్వీ, కృష్ణుడు, జీవిత, రాజశేఖర్ వంటి వారి కృషి కూడా ఎంతో ఉంది. ఎన్నికలకు ముందే పార్టీ తీర్ధం పుచ్చుకున్నే వీరంతా వైసీపీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. తమ సినీ గ్లామర్ ను ఉపయోగించుకుంటూ ఊరూరా తిరుగుతూ వైసీపీకి ప్రచారం చేశారు. ఇప్పుడు వైసీపీ అదికారంలోకి రావడంతో వీరిలో ఒక్కొక్కరిగా పదవులు వరిస్తున్నాయి. గతంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్.. ఇప్పటికే పృధ్వీరాజ్ కు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌ గా నామినేటెడ్ పదవిలో నియమించారు. ఇప్పుడు వైసీపీ తరపున ప్రచారం చేసిన సీనియర్ నటుడు అలీకి మరో కీలక పదవిని కట్టబెట్టనున్నారు. గతంలో ఎంతో మంది సీనియర్ నటులు, నిర్మాతలు నిర్వహించిన ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా అలీని నియమించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అలీ పంట పండినట్లేనని భావిస్తున్నారు.

గతంలో బాల నటుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించి వందల కొద్దీ సినిమాల్లో హాస్యనటుడిగా కూడా మెప్పించిన అలీ.. హీరోగానూ యమలీల, ఘటోత్కచుడుతో పాటు పలు సినిమాల్లో రాణించారు. కొంతకాలంగా సినీ పరిశ్రమలో నవతరం హాస్యనటుల రాకతో అలీ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో ఆయన పలు టీవీ షోల్లోనూ మెరుస్తున్నారు. గతంలో టీడీపీ తరఫున ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఈసారి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ పార్టీలో చేరాలో తెలియక గందరగోళంలో ఉన్న అలీ చివరికి వైసీపీ గూటికి చేరారు. ఆ పార్టీ తరఫున జిల్లాల్లో తిరుగుతూ తన సామాజిక వర్గంతో పాటు తన అభిమానులనూ వైసీపీ వైపు మళ్లించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో సీఎం జగన్ ఆయనకు హామీ ఇచ్చిన విధంగా కీలకమైన నామినేటెడ్ పదవిని కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగు పరిశ్రమ నుంచి సీఎం జగన్ కు తగిన స్ధాయిలో మద్దతు దొరకలేదు. సినీ పరిశ్రమకు చెందిన వారంతా గత టీడీపీ ప్రభుత్వానికి అనుకూలమైన వారు కావడమే ఇందుకు కారణమని వైసీపీ వర్గాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. దీంతో తమ వద్దకు వచ్చిన నలుగురైదుగురికి నామనేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా సినీ రంగానికి తాము ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించేలా చేయడం ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న కర్తవ్య్తం. ఇందులో భాగంగా అలీకి కీలకమైన ఎఫ్.డి.సి ఛైర్మన్ పదవి కట్టబెట్టనున్నారు.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>