ఏపీ ఎన్నికల్లో గెలుపు తమదే అనే ధీమాలో ఉన్న వైసీపీ నేతలు...పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేబినెట్‌లో తమకు బెర్త్ దక్కుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కొందరు నాయకులైతే ఇప్పటికే ఇందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో నాయకులెవరికీ జగన్ స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని... ఫలితాలు వచ్చిన తరువాతే దీనిపై చర్చిద్దామని నేతలకు ఆయన తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గ కూర్పు ఏ రకంగా ఉండాలనే అంశంపై వైఎస్ జగన్ ఇప్పటికే ఓ ఆలోచనకు వచ్చారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఏపీలో ముఖ్యమంత్రిని కలుపుకుని మొత్తం 26 మందితో కేబినెట్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన ముఖ్యమంత్రి మినహా 25 మందిని కేబినెట్‌లోకి తీసుకొవచ్చు. అన్ని వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిథ్యం కల్పిస్తూ ఆ 25 మందిని ఎంపిక చేసుకోవడం జగన్ వంటి వారికి కొంత కష్టమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే... 25 లోక్ సభ స్థానాల పరిధి నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసైడయ్యారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితుల దగ్గర కూడా చెప్పారని సమాచారం.
ఒకవేళ వైఎస్ జగన్ ఈ రకమైన ఆలోచనతో ఉంటే... పార్టీలోని చాలామంది సీనియర్ నేతలకు కేబినెట్ బెర్త్‌లు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ రకంగా ఆలోచించడం లేదని... జగన్ కూడా ఈ రకమైన ఆలోచనతో కేబినెట్ విస్తరణ చేపట్టే ఛాన్స్ ఉందని కొందరు అశావాహులు అభిప్రాయపడుతున్నారు. జగన్ తన ఆలోచనతో ముందుకు సాగితే... మండలి నుంచి ఎవరికి అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు కేబినెట్ బెర్త్‌ల కోసం ఆశావాహులు ఎక్కువగా ఉండటం కూడా వైసీపీ అధినేత ఈ రకమైన ఆలోచన చేయడానికి ఒక కారణమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Tdp, Ys jagan mohan reddy, Ysrcp