వైసీపీ సీనియర్ నేతకు షాక్... టికెట్ నిరాకరించిన జగన్ ?

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సిద్ధమవుతున్నారు. అయితే ఇక్కడ అంబటి రాంబాబుకు అంత సానుకూలతలు లేవని భావిస్తున్న జగన్... ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో సుముఖంగా లేరని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: February 23, 2019, 11:42 AM IST
వైసీపీ సీనియర్ నేతకు షాక్... టికెట్ నిరాకరించిన జగన్ ?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (షైల్ ఫోటో)
  • Share this:
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు ఇప్పటికే సగానికిపైగా స్థానాల్లో తమ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్టు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కొద్ది రోజులకే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచార బరిలో దిగాలని అటు చంద్రబాబు, ఇటు వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. సర్వేల అధారంగానే ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ టికెట్లు కేటాయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్... పార్టీలోని సీనియర్ నాయకుడికి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సిద్ధమవుతున్నారు. అయితే ఇక్కడ అంబటి రాంబాబుకు అంత సానుకూలతలు లేవని భావిస్తున్న జగన్... ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో సుముఖంగా లేరని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడి నంచి టీడీపీ సీనియర్ నేత, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయనను ఢీ కొట్టేందుకు బలమైన అభ్యర్థి కావాలని చూస్తున్న వైసీపీ అధినేత... ఇందుకోసం టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

టీడీపీలో అధిష్టానం తీరు పట్ల అసంతృప్తితో ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి... త్వరలోనే వైసీపీలో చేరతారనే టాక్ ఉంది. ప్రస్తుతం ఆయన గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అయితే వైసీపీ తరపున ఆయనను సత్తెనపల్లి నుంచి రంగంలోకి దింపాలని జగన్ భావిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అంబటి రాంబాబు వర్గం మాత్రం ఈ సారి టికెట్ తమకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. మొత్తానికి వైఎస్ జగన్‌కు మొదటి నుంచి అండగా ఉంటున్న అంబటి రాంబాబుకు ఈ సారి సత్తెనపల్లి నుంచి పోటీ చేసే అవకాశం దక్కుతుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.First published: February 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు