
సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.
ప్రతి వారం సీబీఐ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందన్న కోపంతో వైఎస్ జగన్ శుక్రవారాన్ని రద్దు చేసి వారానికి ఆరు రోజులు చేస్తారేమో అంటూ లోకేష్ సెటైర్లు వేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రతి వారం కోర్టుకు వెళ్లాల్సి వస్తుందన్న కోపంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారాన్ని కూడా రద్దు చేస్తారేమో అని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. శాసనమండలిని రద్దు చేయడానికి ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంలో సీఎం జగన్పై నారా లోకేష్ ట్వీట్ చేశారు. ‘తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ గారికి కోర్టు మినహాయింపు దక్కలేదు. కోర్టులను రద్దు చేస్తారా? లేదా ప్రతీ శుక్రవారం వెళ్లక తప్పదని శుక్రవారాన్ని తీసేసి వారానికి ఆరు రోజులే అని జీవో తెస్తారా?’ అని ట్వీట్ చేశారు. అసలు తాము శాసనమండలిలో ఏ బిల్లును కూడా అడ్డుకోలేదని, కేవలం సవరణలు మాత్రమే కోరామని లోకేష్ చెప్పారు. ‘తుగ్లక్ నిర్ణయాలకు అడ్డు వస్తే శాసన వ్యవస్థలను కూడా శాసిస్తా అంటున్నారు వైఎస్ జగన్. మండలిని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారు. ఇప్పటి వరకూ మండలిలో ఒక్క బిల్లుని కూడా తిరస్కరించలేదు. కొన్ని బిల్లులకు సవరణలు అడిగాం.’ అని మరో ట్వీట్ చేశారు.
‘కొన్ని బిల్లులు ప్రజాభిప్రాయం కోసం సెలెక్ట్ కమిటీకి వెళ్లాయి. బిల్లులు ప్రజాభిప్రాయానికి వెళితే జగన్ గారు ఎందుకు వణికిపోతున్నారు? మండలి రద్దుతోనే మూడు ముక్కలాట ప్రజలు కోరుకున్నది కాదు. ఆయన స్వార్ధ నిర్ణయం అని స్వయంగా జగన్ ఒప్పుకున్నారు.’ అని లోకేష్ అన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 27, 2020, 16:09 IST