బీజేపీ, టీడీపీ, జనసేనకు బ్రేక్ వేసేందుకు జగన్ అస్త్రం...

ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియా వేదికగా నేతలు, పార్టీలు, వ్యక్తిత్వ హననం జరుగుతోందని భావిస్తున్న జగన్ ప్రభుత్వం ఈ మేరకు కఠిన చర్యలకు సిద్ధమైంది.

news18-telugu
Updated: November 17, 2019, 6:36 PM IST
బీజేపీ, టీడీపీ, జనసేనకు బ్రేక్ వేసేందుకు జగన్ అస్త్రం...
జగన్, చంద్రబాబు, పవన్
  • Share this:
ఏపీలో తమ ప్రభుత్వంపై బీజేపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ, జనసేన సాగిస్తున్న మతపరమైన దుష్ప్రచారాన్ని కేసులతో ఎదుర్కొనేందుకు జగన్ సర్కారు సిద్ధమైంది. ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్న ఆరోపణలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా వంతపాడుతుండటంపై ఆగ్రహంగా ఉన్న సర్కారు.. ఆయా ఆరోపణలను ప్రసారం చేసిన ఓ మీడియా ఛానల్ కు ఇప్పటికే నోటీసులు కూడా పంపింది. రేపటి నుంచి మిగతా ఛానళ్లు, పత్రికలు, సోషల్ మీడియా అకౌంట్ల అడ్మిన్లకూ నోటీసులు పంపనున్నట్లు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని ఇప్పటికే ప్రకటించారు.

ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియా వేదికగా నేతలు, పార్టీలు, వ్యక్తిత్వ హననం జరుగుతోందని భావిస్తున్న జగన్ ప్రభుత్వం ఈ మేరకు కఠిన చర్యలకు సిద్ధమైంది. ఏపీలో ఇంగ్లీష్ భాష అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మత మార్పిడులను ప్రోత్సహించేలా ఉందని, ఇందులో మతపరమైన కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా తిరుమల, అన్నవరం దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులు ఉన్నారని, ప్రభుత్వం వారితో అన్యమత ప్రచారం సాగిస్తోందని ఆరోపించారు. సరిగ్గా ఇవే అంశాలను తాజాగా ప్రస్తావించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాటికి కొనసాగింపుగా మరికొన్ని ఆరోపణలు చేశారు. డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ తిరుమల దర్శనానికి ఎలా వెళతారంటూ చంద్రబాబు ప్రశ్నించగా.. తిరుమల లడ్డూను జగన్ తింటారా అంటూ పవన్ విమర్శలు ఎక్కుపెట్టారు. అంతకుముందు ఇంగ్లీష్ మాధ్యమం అమలుపై పెట్టిన ప్రెస్ మీట్ లో తిరుమల సుప్రభాతాన్ని సైతం ఇంగ్లీష్ లో పాడించుకోండని పవన్ సలహా ఇచ్చారు. ఆయా విమర్శల్ని మీడియా ఛానళ్లతో పాటు పత్రికలు, సోషల్ మీడియా, వెబ్ సైట్లు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హైందవ సంప్రదాయాలను తుంగలో తొక్కుతోందంటూ కథనాలు ప్రచురించాయి.

తాజాగా విజయవాడ పున్నమిఘాట్ లో ఉన్న బెర్హమ్ పార్క్ లో మేరీమాత ప్రతిమలు ఉండటంపైనా కన్నా తీవ్ర ఆరోపణలు చేశారు. వీటిని యథాతథంగా ప్రసారం చేయడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రసారం చేశారంటూ ఏపీ 24X7 ఛానల్ కు పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నోటీసులు పంపారు. బెర్హమ్ పార్క్ లో ఉన్న మేరీమాత ప్రతిమ విజయవాడలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం గతంలో ఏర్పాటు చేసిందని, ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవని ప్రకటించారు. దీంతో సదరు ఛానల్ కూడా ఈ కథనం ప్రసారంలో తమకెలాంటి దురుద్దేశాలు లేవంటూ సవరణ కథనాన్ని ప్రసారం చేసింది. వాస్తవానికి ప్రభుత్వం వివరణ ఇచ్చినా స్పందించకుంటే ఆయాశాఖల కార్యదర్శులకు పరువునష్టం నోటీసులు పంపే అధికారం ఉంది. ఇదే కోవలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను యథాతథంగా ప్రచురిస్తున్న, ప్రసారం చేస్తున్న, సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న సంస్ధలు, వ్యక్తులకు రేపటి నుంచి నోటీసులు పంపనున్నారు.

దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు. మీడియా సంస్ధలతో పాటు విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై కూడా ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో రేపటి నుంచి ఎవరెవరికి నోటీసులు వెళ్లబోతున్నాయి, వారిపై ఎలాంటి చర్యలుంటాయి, వీటితో మత విద్వేష కథనాలు అగిపోతాయా లేదా అన్న అంశంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...