విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సిట్ కేసును రాజ్యాంగ కోణంలో కాకుండా రాజకీయ కోణంలో విచారణ జరుపుతోందని ఆయన ఆరోపించారు. కేసును కేంద్ర ప్రభుత్వ సంస్థతో, స్వచ్ఛంద విచారణ జరిపించాలని కోరారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ రిట్ పిటిషన్ రేపు (గురువారం) విచారణకు రానుంది. జగన్ దాఖలు చేసిన రిటి పిటిషన్లో ఆయన మొత్తం ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీ, విశాఖ విమానాశ్రయం స్టేషన్ హౌస్ అధికారి, జగన్‌పై దాడి కేసు విచారణ జరుపుతున్న సిట్ ఇన్చార్జి, కేంద్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను ప్రతివాదులుగా చేర్చారు. ప్రభుత్వం, పోలీసులు కలిపి కేసును పక్కదోవ పట్టిస్తున్నారని పిటిషన్లో జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వ సంస్ధతో విచారణ జరిపించాలంటూ వైసీపీ నేతలు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో జరిగితే నిజాలు బయటకు రావని వారు అనుమానం వ్యక్తం చేశారు. అదే సమయంలో జగన్ మీద కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉందని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు నిందితుడే కాదని, సాక్షి కూడా ఆయనేనని, కాబట్టి అతని ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ శ్రీనివాసరావు చెప్పడం రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించింది.
రాజ్‌నాథ్‌ను కలిసిన వైసీపీ నేతలు
జగన్ మీద దాడి జరిగిన వెంటనే ఆయన ఫిర్యాదు చేయకుండా ఎందుకు వెళ్లిపోయారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విమానాశ్రయ అధికారులు కూడా రక్తంతో ఉన్న వ్యక్తిని ఎందుకు వెళ్లనిచ్చారంటూ ప్రశ్నించారు. ఈ కేసులో స్టేట్ మెంట్ ఇవ్వాల్సిందిగా జగన్‌ను విశాఖ పోలీసులు కోరగా, ఆయన తనకు వారిపై నమ్మకం లేదని చెప్పినట్టు ప్రచారం జరిగింది. అయితే, పోలీసుల మీద తమకు నమ్మకం ఉందని, ప్రభుత్వం మీదే నమ్మకం లేదని ఆ తర్వాత వైసీపీ నేతలు సర్దిచెప్పారు. అయితే, అనూహ్యంగా హైకోర్టులో జగన్ రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో కేసు ఎటు తిరుగుతుందా అని ఆసక్తిని పెంచింది.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసిన వైసీపీ ప్రతినిధుల బృందం
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.