కేంద్రానికి జగన్ సర్కార్ ఝలక్..

నాలుగేళ్లుగా పరిమితికి మించి సౌర, పవన విద్యుత్ కొనుగోలు చేశామని, దీనివల్ల జెన్‌కో విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించి, సోలార్‌, విండ్‌ పవర్‌ ల కోసం అధిక భారాన్ని మోస్తున్నట్లు బాలినేని గుర్తుచేశారు.

news18-telugu
Updated: October 13, 2019, 4:20 PM IST
కేంద్రానికి జగన్ సర్కార్ ఝలక్..
నరేంద్ర మోదీ, వైఎస్ జగన్ (ఫైల్)
  • Share this:
టీడీపీ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించవద్దంటూ తమకు పదేపదే లేఖలు రాస్తున్న కేంద్రానికి జగన్ సర్కారు ఝలక్ ఇచ్చింది. విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి పునరుత్పాదన విద్యుత్ కొనుగోళ్ల కారణంగా భారీ నష్టాలు ఎదురవుతున్నాయని, అందుకే వీటి భారం కేంద్రమే భరించాలంటూ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కేంద్రమంత్రి ఆర్కేసింగ్ కు లేఖ రాశారు. అసలే పీపీఏల విషయంలో జగన్ ప్రభుత్వం తీరుతో ఆగ్రహంగా ఉన్న కేంద్రం ఈ లేఖపై ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 25 సంవత్సరాల వ్యవధి కోసం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించాలన్న జగన్ ప్రభుత్వ విధానాన్ని కేంద్రం వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్కే సింగ్ ఈ వ్యవహారం సరికాదంటూ రాష్ట్రానికి ఇప్పటికే మూడు లేఖలు రాశారు. ప్రతీ లేఖలోనూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష వల్ల ఎదురయ్యే సమస్యలను ఆయన ఏకరువు పెడుతూ వచ్చారు. దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతినకుండా ఉండాలన్నా, విద్యుత్ గ్రిడ్ కుప్పకూలకుండా ఉండాలన్నా, ఐక్యరాజ్యసమితి సూచనల ప్రకారం దేశ విద్యుత్ రంగంలో పునరుత్పాదన విద్యుత్ వాటా పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆగిపోకుండా ఉండాలన్నా పీపీఏల సమీక్ష చేయొద్దంటూ ఆర్కేసింగ్ పలుమార్లు హెచ్చరించారు.

ఎల్వీ సుబ్రమణ్యంకు కేంద్రం రాసిన లేఖ


విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ తాజాగా ప్రధాని మోడీతో జరిగిన భేటీలో వివరణ కూడా ఇచ్చారు. చంద్రబాబు ఇంటి యజమాని లింగమనేని రమేష్ కు చెందిన పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్ధ నిబంధనల ఉల్లంఘన, దానికి గత టీడీపీ ప్రభుత్వ చెల్లింపులు వంటి అంశాలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్ధితుల్లో పీపీఏల సమీక్ష తప్పదని జగన్ ప్రధానికి స్పష్టం చేశారు. దీనికి కొనసాగింపుగా రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కేంద్రమంత్రి ఆర్కేసింగ్ కు కౌంటర్ లేఖ రాశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష చేయక తప్పని పరిస్ధితి నెలకొందని, లేకుంటే విభజన కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి మరిన్ని సమస్యలు తప్పవని తేల్చిచెప్పారు. సౌర, పవన విద్యుత్ ఒప్పందాల కారణంగా ఏటా ప్రభుత్వంపై రూ.5 వేల కోట్ల భారం పడుతుందని తెలిపారు.

మోదీతో జగన్ సమావేశం


సౌర, పవన విద్యుత్ యూనిట్‌కు రూ.3.55ల (అడక్వెసీ కాస్ట్‌ రూ. 2.5, బాలెన్సింగ్‌ కాస్ట్‌ రూ. 1.05, గ్రిడ్‌ గ్రిడ్‌ అనుసంధాన ఖర్చు రూ. 0.25లు) భారం పడుతోందని లేఖలో బాలినేని గుర్తుచేశారు. విద్యుత్ రంగంలో ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని అధిగమించడానికి విద్యుత్‌ సరఫరా కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి సోలార్‌, విండ్‌ పవర్‌ల కంపెనీలతో నిరంతరాయంగా చర్చలు జరుపుతోందని, తగిన పరిష్కారమార్గాల కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి (విద్యుత్, అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ)


రాష్ట్రంలో ఏడాదికి 60వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటే అందులో 15వేల మిలియన్ యూనిట్లు సోలార్‌, విండ్ పవర్‌లదేనని బాలినేని లేఖలో వెల్లడించారు. దీనివల్ల ఏడాదికి రూ.5,300 కోట్లు భారం పడుతోందన్నారు.. నాలుగేళ్లుగా పరిమితికి మించి సౌర, పవన విద్యుత్ కొనుగోలు చేశామన్నారు. దీనివల్ల జెన్‌కో విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించి, సోలార్‌, విండ్‌ పవర్‌ ల కోసం అధిక భారాన్ని మోస్తున్నట్లు బాలినేని గుర్తుచేశారు.ఇన్ని సమస్యలున్నా ప్రత్యామ్నాయ, సాంప్రదాయేత ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన 175 మెగావాట్స్ లక్ష్యాన్ని తనకు కష్టం ఉన్నా సరే భుజానకెత్తుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సబ్సిడీల కోసం సంక్షేమ పథకాలు ప్రకటించిన విధంగానే కేంద్రం కూడా సౌర, పవన విద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా సబ్సిడీలు కల్పిస్తే బాగుంటుందన్నారు. ఈ నేపథ్యంలో సంక్షోభానికి దీర్ఘకాలిక పరిష్కారం చూపేందుకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి నేతృత్వంలో కేంద్ర సాంప్రదాయేతర ఇంధన వనరులు శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధికశాఖ ప్రధాన కార్యదర్శి, ఏపి ఇంధన శాఖ కార్యదర్శిలతో కూడిన కమిటీ వేయాలని మంత్రి బాలినేని లేఖలో కోరారు.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: October 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading