Your Leader : వంగవీటి పేరు ఓట్లు రాలుస్తుందా ? కమలదళంలో నరేంద్ర విజయావకాశాలు ఎంత ?

వంగవీటి రంగా సోదరుడు నారాయణరావు తనయుడు వంగవీటి నరేంద్ర ప్రస్తుతం బీజేపీ తరఫున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. వంగవీటి కుటుంబ నేఫథ్యం ఉండటంతో బీజేపీ ఆయన్ను పార్టీలో చేర్చుకుని విజయవాడ ఈస్ట్ టికెట్ కేటాయించింది.

news18-telugu
Updated: April 2, 2019, 8:29 PM IST
Your Leader : వంగవీటి పేరు ఓట్లు రాలుస్తుందా ? కమలదళంలో నరేంద్ర విజయావకాశాలు ఎంత ?
వంగవీటి రంగా సోదరుడు నారాయణరావు తనయుడు వంగవీటి నరేంద్ర ప్రస్తుతం బీజేపీ తరఫున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. వంగవీటి కుటుంబ నేఫథ్యం ఉండటంతో బీజేపీ ఆయన్ను పార్టీలో చేర్చుకుని విజయవాడ ఈస్ట్ టికెట్ కేటాయించింది.
  • Share this:
విజయవాడ రాజకీయాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వంగవీటి కుటుంబం నుంచి మరో వారసుడు ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే వంగవీటి మోహన రంగా కుమారుడు రాధాకృష్ణ టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా పనిచేస్తుండగా... రంగా సోదరుడు నారాయణరావు తనయుడు వంగవీటి నరేంద్ర ప్రస్తుతం బీజేపీ తరఫున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.
విజయవాడలో ప్రధాన రాజకీయ కుటుంబాల్లో ఒకటైన వంగవీటి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెరపైకి వచ్చారు. దివంగత వంగవీటి మోహనరంగా సోదరుడైన నారాయణరావు కుమారుడు వంగవీటి నరేంద్ర తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా రంగంలో ఉన్నారు. రెండు దశాబ్దాలుగా బ్యాంకు ఉద్యోగిగా పనిచేసిన వంగవీటి నరేంద్ర... ఈ మధ్యే ఉద్యోగాన్ని వదిలిపెట్టి బీజేపీలో చేరారు. ఉన్నత విద్యావంతుడు కావడం, వంగవీటి కుటుంబ నేఫథ్యం ఉండటంతో బీజేపీ కూడా ఆయన్ను పార్టీలో చేర్చుకుని విజయవాడ ఈస్ట్ టికెట్ కేటాయించింది.

ఎన్నికల ప్రచారంలో వంగవీటి నరేంద్ర
ఎన్నికల ప్రచారంలో వంగవీటి నరేంద్ర


వంగవీటి కుటుంబ వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఐదో వ్యక్తిగా నరేంద్ర నిలిచారు. అప్పట్లో వంగవీటి మోహనరంగాతో పాటు ఆయన సోదరుడు రాధాకృష్ణ రాజకీయాల్లో రాణించగా... ఆ తర్వాత రంగా భార్య రత్నకుమారి, కుమారుడు రాధాకృష్ణ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అయితే వంగవీటి వారసత్వాన్ని నిలబెట్టడంలో రాధా విఫలం కావడంతో విజయవాడ రాజకీయాల్లో గతంలో రంగాకు అనుచరులుగా పనిచేసిన వారంతా ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో వివిధ పార్టీల తరఫున అభ్యర్ధులుగా నిలిచారు. అదే సమయంలో స్వయానా రంగా కుమారుడైన రాధాకృష్ణ... పోటీకి దూరంగా ఉంటూ టీడీపీకి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో వంగవీటి నరేంద్ర
ఎన్నికల ప్రచారంలో వంగవీటి నరేంద్ర


విజయవాడ సెంట్రల్ తో పాటు కాపు సామాజికవర్గ జనాభా అధికంగా ఉన్న తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి కుటుంబ వారసుడిగా నరేంద్ర బరిలో ఉండటం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నరేంద్ర రాజకీయ అరంగేట్రం చేసే నాటికి సోదరుడు రాధాకృష్ణ టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడంపై ఆయన బహిరంగంగానే మండిపడ్డారు. తన తండ్రిని చంపిన పార్టీలోకి ఎలా వెళతారంటూ సోదరుడు రాధాపై నేరుగానే విమర్శలు చేసిన నరేంద్ర... విజయవాడలో వార్తల్లో నిలిచారు. అప్పటి నుంచి ప్రజల్లోకి వెళుతూ వంగవీటి రంగాకు అసలైన వారసుడిని తానేనంటూ ప్రచారం చేస్తున్న నరేంద్ర... తనకు మద్దతునివ్వాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా స్ధానికులు కూడా అప్పట్లో రంగాతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

ప్రజలతో ముచ్చటిస్తున్న బీజేపీ అభ్యర్థి వంగవీటి నరేంద్ర
ప్రజలతో ముచ్చటిస్తున్న బీజేపీ అభ్యర్థి వంగవీటి నరేంద్ర
“ రంగా తర్వాత బెజవాడలో మమ్మల్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ఇళ్ల పట్టాలతో పాటు మరెన్నో సమస్యలపై రంగా చేసిన పోరాటం ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు రంగా వారసుడిగా నరేంద్ర రాజకీయాల్లోకి రావడం మాకు సంతోషంగా ఉంది. రంగా లాగే నరేంద్ర కూడా మా సమస్యలు పరిష్కరిస్తాడన్న నమ్మకం కలుగుతోంది.”--- కృష్ణలంకలో స్ధానిక మహిళ


విభజన హామీల అమలులో విఫలమయ్యారంటూ టీడీపీ చేస్తున్న ప్రచారంతో రాష్ట్రంలో బీజేపీకి గడ్డుకాలం నడుస్తోంది. అటువంటి క్లిష్ట పరిస్ధితుల్లో రాజకీయ అరంగేట్రం చేసిన నరేంద్ర... వంగవీటి బ్రాండ్ తో పాటు తన నేపథ్యాన్ని వివరిస్తూ ఓటు ఇవ్వాలని కోరుతున్నారు.

సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 ప్రతినిధి, అమరావతి
Published by: Krishna Adithya
First published: April 2, 2019, 7:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading