news18-telugu
Updated: November 10, 2020, 8:21 PM IST
అసదుద్దీన్ ఒవైసీ (File)
ఎంఐఎం అనగానే అందరికి గుర్తొచ్చేది.. హైదరాబాద్ మాత్రమే. కానీ ఆ ముద్రను అధిగమించేందుకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతున్నట్టుగానే కనిపిస్తోంది. తెలంగాణకు వెలుపల అభ్యర్థులను నిలపుతున్న మజ్లీస్ పార్టీ.. మంచి ఫలితాలనే రాబడుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర, బిహార్ ఎంఐఎం ఖాతానే తెరిచిన సంగతి తెలిసిందే. గతంలో జరిగిన బిహార్ ఉప ఎన్నికల్లో కిషన్‌గంజ్ స్థానాన్ని గెలుచుకుని మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్రంలో అడుగుపెట్టింది. అదే ఊపుతో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మజ్లీస్ పార్టీ అభ్యర్థులను నిలిపింది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నియోజవర్గాలను లక్ష్యంగా చేసుకుని బరిలో నిలిచింది.
అయితే ఈ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ జోరు కొనసాగించిందనే చెప్పాలి. పలుచోట్ల ప్రత్యర్థులకు మజ్లీస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ ప్రకారం మజ్లీస్ ఐదు చోట్ల విజయం సాధించింది. మజ్లీస్ గెలుపొందిన స్థానాల్లో అమోర్ నియోజకవర్గం(అభ్యర్థి- అక్తారూల్ ఇమామ్, బిహార్ ఎంఐఎం అధ్యక్షుడు), కొచ్చధామమ్ నియోజవర్గం(అభ్యర్థి-మహమ్మద్ ఇజార్ అస్ఫీ), జోకిహాట్ నియోజవర్గం(అభ్యర్థి-షానవాజ్ ఆలం), బైసీ నియోజకవర్గం(అభ్యర్థి-సయ్యద్ రుక్నుద్దీన్), బహదూర్‌గంజ్ నియోజకవర్గం(అభ్యర్థి-అజార్ నయీమి) ఉన్నాయి. ఎంఐఎం మరిన్ని స్థానాలు గెలుచుకుంటుందా, లేదా అనేది తెలియాలి అంటే కౌంటింగ్ పూర్తయ్యే వరకు వేచిచూడాల్సి ఉంది.
ఇక, మరోవైపు బిహార్‌లో కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఎన్డీయే కూటమి 124 స్థానాల్లో గెలుపు/అధిక్యం, మహాకూటమి 111 స్థానాలు గెలుపు/అధిక్యం, ఎల్జేపీ 1 స్థానం గెలుపు/అధిక్యం, ఇతరులు 07 స్థానాలు గెలుపు/అధిక్యంలో ఉన్నాయి.
Published by:
Sumanth Kanukula
First published:
November 10, 2020, 8:21 PM IST