జగన్ మరో అస్త్రం... చంద్రబాబుకి షాక్ ఇవ్వాలని...

ఏపీ శాసన మండలి రద్దు దిశగా అడుగులు వేస్తున్న వైసీపీ... ఈ విషయంలో టీడీపీని అడ్డుకునేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లబోతున్నట్లు తెలిసింది.

news18-telugu
Updated: January 24, 2020, 5:48 AM IST
జగన్ మరో అస్త్రం... చంద్రబాబుకి షాక్ ఇవ్వాలని...
సీఎం జగన్ మోహన్ రెడ్డి (File)
  • Share this:
వచ్చే సోమవారం ఏపీ శాసన మండలి రద్దయ్యేలా కనిపిస్తున్నాయి రాజకీయ పరిస్థితులు. ప్రభుత్వ నిర్ణయాలకు, పరిపాలనకు శాసన మండలి అడ్డుగా ఉందని భావిస్తున్న వైసీపీ అధినేత, సీఎం జగన్... ఎట్టి పరిస్థితుల్లో మండలిని రద్దు చేసి తీరాలని పట్టుదలతో ఉన్నారు. ఐతే... ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ... సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తోంది. ఏంటంటే... జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి... ఆల్రెడీ ఎన్టీఆర్ రద్దు చేసిన శాసన మండలిని... తన పుట్టిన రోజున తిరిగి తెచ్చారు. ఇప్పుడా మండలిని రద్దు చేయడమంటే... వైఎస్ ఆశయాల్ని తుంగలో తొక్కినట్లే అనే అస్త్రాన్ని ప్రయోగించాలని టీడీపీ భావిస్తోంది. తద్వారా వైసీపీని ఇరకాటంలో పెట్టినట్లు అవుతుందని టీడీపీ లెక్కలేసుకుంటోంది. ఐతే... టీడీపీకే షాక్ ఇవ్వాలని వైఎస్ జగన్ మరో వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఏంటంటే... వైఎస్ తిరిగి మండలిని తెస్తున్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు... అప్పట్లో ప్రతిపక్ష నేతగా... మండలిని వ్యతిరేకించారు. వైఎస్ తన అనుయాయులకు సీట్లు, పదవులు ఇచ్చేందుకే ఈ మండలిని తెస్తున్నారని విమర్శించారు. అప్పటి చంద్రబాబు వ్యాఖ్యలు, విమర్శలకు సంబంధించి మొత్తం 58 పేజీల డేటాను జగన్ బయటకు తీయిస్తున్నట్లు తెలిసింది. సో... సోమవారం చంద్రబాబు ఎలాగూ తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని భావిస్తున్న జగన్... చంద్రబాబుకి చెక్ పెట్టేందుకు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని అసెంబ్లీలో చదివి వినిపిస్తారనీ, అలాగే వీలైతే... అప్పటి వీడియో క్లిప్పింగులను బయటపెడతారని తెలుస్తోంది. తద్వారా మండలి రద్దు విషయంలో ప్రతిపక్ష టీడీపీకి చెక్ పెట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం అందింది. మరి టీడీపీ ఎలా ఎదుర్కొంటుదన్నది ఆసక్తికరం.

మండలి రద్దు నిర్ణయం సందర్భంగా దాని చరిత్రను ఫటాఫట్ తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి 1958లో మొదలైంది. NT రామారావు సీఎంగా ఉన్నప్పుడు మండలిలో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉండేది. ఫలితంగా టీడీపీ బిల్లుల పాస్ విషయంలో మండలిలో ఇబ్బంది వచ్చేది. అందుకే 1985లో ఎన్టీఆర్ మండలిని రద్దు చేయించారు. తిరిగి 2007లో కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి శాసన మండలిని మళ్లీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మండలి మళ్లీ రద్దయ్యేందుకు 99 శాతం అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో కౌన్సిల్ ఉంది. మిగతా రాష్ట్రాల్లో లేదు. కొన్ని రాష్ట్రాల్లో మండళ్లు కావాలనే ప్రతిపాదనలున్నాయి. కేంద్రం మాత్రం ఇప్పట్లో మండళ్లను తిరిగి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు లేదు.

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మండలిని రద్దు చేయాలనుకుంటే... ఈ ప్రక్రియ కేంద్రంతో ముడిపడి ఉన్నందువల్ల... ఇది వెంటనే అయిపోయే అవకాశాలు లేవు. వైసీపీ నిర్ణయాన్ని కేంద్రం ఒప్పుకుంటే... అప్పుడు మండలి రద్దైపోతుంది. వైసీపీ ప్రభుత్వానికి రాజధానిని విశాఖకు (పరిపాలనా రాజధానిగా) తరలించేందుకు వీలవుతుంది. ఐతే... రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు కాబట్టి... వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం ఒప్పుకునే అవకాశాలు లేవంటున్నారు. మండలిని రద్దు చేయాలని ప్రతిపాదించినా... కేంద్రం దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోకుండా... ఆలస్యం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. ఎవరి వ్యూహాలు వాళ్లు సిద్ధం చేసుకుంటున్నారని మనం అనుకోవచ్చు.
Published by: Krishna Kumar N
First published: January 24, 2020, 5:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading