ప్రభుత్వాన్ని నడపడం తేలికే... పార్టీని నడపడమే కష్టం అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. నిజమే... ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో అధికార యంత్రాంగం ఉంటుంది. మరి పార్టీలో అలా కాదు... ఒక్కో నేత ఒక్కో టైపు. అలకలు, రుసరుసలు, విమర్శలు, ఎత్తుగడలు, వ్యూహాలు, వెన్నుపోట్లు ఇలా ఎన్నో. ఏపీలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి సహజంగానే ఇతర పార్టీల నుంచి నేతలు వలస రావడం జరిగింది. ఐతే... మొదట్లో ఇలాంటి వాటికి చెక్ పెట్టిన వైసీపీ... ఏడాది పాలన తర్వాత మాత్రం వ్యూహాలు మార్చింది. ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా... పక్క పార్టీల నేతల్ని లాగేస్తోంది. దీని వల్ల లాభాలతోపాటూ... నష్టాలూ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాభాలేంటంటే... పార్టీ బలం పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇతర పార్టీలు మరింత బలహీన పడతాయి. తద్వారా ప్రజల్లో వైసీపీ పట్ల పాజిటివ్ కోణం పెరుగుతుంది. నష్టాలేంటంటే... పార్టీలో సీనియర్లకు వలసలు ఇబ్బంది కలిగిస్తాయి. గ్రూపు తగాదాలు పెరుగుతాయి. జిల్లాల్లో వలస వచ్చిన వాళ్లతో సఖ్యత ఉండే అవకాశాలు తక్కువ. అంతర్గత కుమ్ములాటల సమస్యలూ ఉంటాయి.
ఇప్పుడు వైసీపీకి పై రెండు కోణాలూ ఎదురవుతున్నాయి. క్రమంగా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో... ఈ గ్రూపు రాజకీయాలు అత్యంత ఎక్కువగా ఉండేవి. బట్... వైఎస్ ఎంతో చాకచక్యం ప్రదర్శిస్తూ... చిరునవ్వు నవ్వుతూ... అందరితోనూ మాట్లాడుతూ... అందరికీ సర్దిచెబుతూ... అలా అలా పార్టీని నడిపించేవాళ్లు. కొడుకైన జగన్‌కి ఇంకా ఇలాంటి అనుభవాలు పెద్దగా కలగలేదు. అందువల్ల ఈ గ్రూపు రాజకీయాలకు ఆయన ఎలా చెక్ పెడతారన్నది ముందున్న సవాలు.
ప్రభుత్వ పాలన విషయంలో... తీసుకునే నిర్ణయాల్లో అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ... ఎక్కడా రాజీకి ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్న జగన్‌కి పార్టీలో అలాంటి పరిస్థితి తేవడం తేలికేమీ కాదు. గ్రూపు రాజకీయాలనేవి... ఎంత డేంజరంటే... పక్కన ఉన్నంత వరకూ ఆ నేతలు నవ్వుతూ ఉంటారు. తెరవెనక మాత్రం గోతులు తీస్తారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్త పడకపోతే అడ్డంగా బుక్కైపోయే ప్రమాదం ఉంటుంది.
వైసీపీ ప్రభుత్వ పాలనకు ఏడాది దాటేయడంతో... అప్పట్లో పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రయత్నించిన నేతలు, నాయకులంతా... ఇప్పుడు రకరకాల పదవులు ఆశిస్తూ... హైకమాండ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. సరిగ్గా తమకు అవకాశం దక్కుతుందని ఆశించే సమయంలో... వివిధ జిల్లాల నుంచి ప్రత్యర్థి పార్టీల్లో నేతలు, నాయకులు ఎంట్రీ ఇస్తుండటంతో... వైసీపీ నేతలు, నాయకులకు ఇబ్బంది కలుగుతోంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పదవి ఇవ్వడమనేది తేలిక కాదు. పైగా సీనియర్లు చిన్నా చితకా పదవుల్ని ఒప్పుకోరు. అలకపాన్పు ఎక్కుతారు. మరోవైపు టీడీపీ నుంచి మరికొంత మంది రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే... తమ ఉనికికి ఇబ్బందేనని వైసీపీలోని సీనియర్లు కొందరు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
పరిస్థితి చూస్తుంటే... వైఎస్ జగన్... ఇప్పుడు పార్టీ వ్యవహారాలపై మరింత ఎక్కువ ఫోకస్ పెట్టక తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగనే పార్టీపై ఎక్కువ ఫోకస్ పెడితే... అంతంత మాత్రంగా ఆదాయం వస్తున్న ప్రభుత్వ పాలన గాడి తప్పే ప్రమాదం ఉంటుంది. ఈ రెండు పడవల్లో జాగ్రత్తగా ప్రయాణించడం అన్నది అధినేత ముందున్న అసలు సవాలుగా కనిపిస్తోంది. ఇవన్నీ ఎదుర్కొంటూ... విజయం సాధిస్తే... వైఎస్ జగన్ మరో తిరుగులేని నేతగా మారతారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.