Vizag Steel Plant: తెలిగింటి కోడలిగా బంగారాన్ని అమ్మేయకండి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం మార్చుకోవాలన్న విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)

విశాఖ స్టీల్ ప్లాంట్ ను బంగారు ఆభరణంతో పోల్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. తెలుగింటి కోడలైన నిర్మల సీతారామన్‌కు ఈ విషయం బాగా తెలుసన్నారు. ఇంట్లో చిన్నపాటి కష్టాలున్నాయని ఏ తెలుగింటి ఆడపడుచు కూడా తాను కూడ బెట్టుకున్న బంగారు ఆభరణాలను తెగనమ్ముకోదని.. అలాగే స్టీల్ ప్లాంట్ ను అమ్మడం కూడా సరికాదన్నారు.

 • Share this:
  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీ విజయసాయిరెడ్డి తన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఆంధ్రుల సుదీర్ఘ పోరాటాలు, ఆత్మబలిదానాలతో అవతరించిన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఫైనాన్స్‌ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన.. ప్రైవేటైజేషన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, ఉద్యోగులు ఇప్పటికి 40 రోజులుగా ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.

  వాస్తవానికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ 2002 నుంచి 2015 వరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడిచిందని గుర్తు చేశారు. ఆ తరువాతే నష్టాల్లోకి వచ్చిందన్నారు. అందుకు రెండు బలమైన కారణాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకునేందుకు స్టీల్‌ ప్లాంట్‌ పెద్ద ఎత్తున విస్తరణను చేపట్టిందని. అందుకోసం పెద్ద మొత్తాలలో రుణాలను సేకరించిందని. అదే సమయంలో అంతర్జాతీయంగా స్టీల్‌ మార్కెట్‌లో ఏర్పడిన ఒడిదుడుకుల కారణంగా నష్టాలపాలైందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత ఇనుప ఖనిజం గనులు లేనందున ముడి ఖనిజాన్ని మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేయవలసి వస్తోందన్నారు. నష్టాలకు ఇదో ప్రధాన కారణమన్నారు.

  కేవలం కొన్ని సంవత్సరాల నష్టాలను సాకుగా చూపిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించడం సమంజసం కాదు. నష్టాల నుంచి గట్టెక్కించి స్టీల్‌ ప్లాంట్‌ తిరిగి లాభాల బాట పట్టడానికి అవసరమైన పునఃవ్యవస్థీకరణ, పునరుద్దరణ, పునరుజ్జీవనం వంటి చర్యలను చేపట్టవలసిందిగా శ్రీ విజయసాయి రెడ్డి ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే గనులు కేటాయించడం అసాధ్యమేమీ కాదని గుర్తు చేశారు. 14 శాతం వడ్డీతో స్టీల్‌ ప్లాంట్‌ తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీ రేటుకు మార్పిడి చేయాలి. వడ్డీ చెల్లింపులపై రెండేళ్ళపాటు మారటోరియం ప్రకటించడానికి అనుమతించాలన్నారు. రుణాలను ఈక్విటీ కింద మార్పిడి చేయాలని ఆయన ఆర్థిక మంత్రిని కోరారు.  విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమ బంగారు ఆభరణంగా పరిగణిస్తారని. తెలుగింటి కోడలు కూడా అయిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌కు ఈ విషయం బాగా తెలుసు అన్నారు. ఇంట్లో చిన్నపాటి కష్టాలున్నాయని ఏ తెలుగింటి ఆడపడుచు కూడా తాను కూడ బెట్టుకున్న బంగారు ఆభరణాలను తెగనమ్ముకోదు. అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వంటి నవరత్నాన్ని విక్రయించడానికి ఆంధ్ర ప్రజలు కూడా ఎట్టి పరిస్థితులలోను అంగీకరించరన్నారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల పోరాట చరిత్రకు చిహ్నమన్నారు. 32 మంది ఆత్మబలిదానాల ఫలితమని.. అలాంటి చారిత్రక చిహ్నాన్ని అమ్మకానికి పెట్టి ఆంధ్రుల మనోభావాలను గాయపరచవద్దని విజయసాయి రెడ్డి కోరారు.

  విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇంకా ఆంధ్రుల గుండెల్లో మార్మోగుతోందని అన్నారు. 31 ప్రభుత్వరంగ సంస్థలకు మంగళం ఆదాయ పన్ను చట్టం సవరణతో 32 ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం పూనుకోవడం అత్యంత దురదృష్టరమని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ సంస్థలుగా ఇవి ఆవిర్భవించడానికి అనేక దశాబ్దాలు పట్టింది. కానీ ఒక్క రోజులో వీటి అమ్మకానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం కరెక్టు కాదన్నారు.
  Published by:Nagesh Paina
  First published: