ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల రాజకీయం మరింత ముదురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాలపై దాడుల విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. వైసీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది. తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ హస్తముందని ఆరోపించారు. త్వరలోనే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన.. రామతీర్థం ఆలయంలో శ్రీరాముడు విగ్రహం ధ్వంసంపై ప్రశ్నించగా.., చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు.
ఆర్ధరాత్రి సమయంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆలయ తాళాలు పగులగొట్టి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని అతి త్వరలోనే నిజాలు బయటపెడతామన్నారు. రాష్ట్రంలో కల్లోలాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ఆయన అన్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేసారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)
మరోవైపు ఆలయాలపై దాడులపై సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించారు. దేవుడితో చెలగాటమాడితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని సీఎం అన్నారు. విగ్రహాల విధ్వంసానికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ పోలీసులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
ఐతే సీఎం హెచ్చరించి 24గంటలు గడవక ముందే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. స్వామి వారి విగ్రహానికి ఉన్న రెండుచేతులను విరగ్గొట్టారు. మూడు రోజుల వ్యవధిలో రాష్ట్రంలో రెండు హిందూ ఆలయాలపై దాడులు జరగడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలోని కోదండరామాయలంపై దాడి చేసిన దుండగులు శ్రీరామును విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం శిరస్సు భాగాన్ని విడగొట్టి కోనేట్లో పడేశారు. దీనిపై ప్రతిపక్షాలతో పాటు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని ఏపీ బీజేపీ కో ఇన్ ఛార్జ్ సునీల్ ధేవదర్ ప్రశ్నించారు. ఇంతవరకు ఒక్కర్ని కూడా అరెస్ట్ చేయకపపోవడంపై ఆయన మండిపడ్డారు.
Published by:Purna Chandra
First published:January 01, 2021, 13:41 IST