Home /News /politics /

YCP MLC CANDIDATES SELECTION ANALYSIS NGS

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ ఆరుగురే ఎందుకు? ఎవరి నేపథ్యం ఏంటి?

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ ఆరుగురుకే సీఎం జగన్ ఎందుకు ఓటేశారు. వీరి ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది? అధిష్టానం లెక్కలు ఏంటి?

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ ఆరుగురుకే సీఎం జగన్ ఎందుకు ఓటేశారు. వీరి ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది? అధిష్టానం లెక్కలు ఏంటి?

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ ఆరుగురుకే సీఎం జగన్ ఎందుకు ఓటేశారు. వీరి ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది? అధిష్టానం లెక్కలు ఏంటి?

  ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో మండలికి పోటీ చేసే అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం అసెంబ్లీలో అధికార పార్టీకి తిరుగులేదు.. కచ్చితంగా ఆరు సీట్లు ఆ పార్టీ ఖాతాలోకే చేరుతాయి అనడంలో సందేహం లేదు. అందుకే మొత్తం ఆరుగురు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించింది అధికార పార్టీ. అయితే చాలమంది పేర్లు వినిపించినా ఈ ఆరుగురికే ఎందుకు అధిష్టానం ఓటేసింది. వీరి నేపథ్యం ఏంటి..? ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అని చెప్పేందుకే జగన్ ఈ వ్యూహం అనుసరించారా? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? లేక సామాజిక లెక్కలు వేసుకుని ఎంపిక జరిగిందా? ఆ ఆరుగురి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం..

  చల్లా భగీరథరెడ్డి


  కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి రెండో కుమారుడే చల్లా భగీరథరెడ్డి. జగన్ కు అంత్యంత నమ్మకస్తుడిగా ఉండే.. చల్లా 2021 జనవరి 1వ తేదీన కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందారు. దీంతో సీఎం జగన్ కర్నూలు జిల్లా‌ అవుకుకు స్వయంగా వచ్చి చల్లా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ సమయంలోనే చల్లా భగీరథరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. హామీ ఇచ్చినట్లుగానే భగీరథరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు అధినేత జగన్.

  అయితే భగీరథరెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా పని చేశారు. తరువాత వైఎస్ఆర్ మరణంతో తన తండ్రి రామకృష్ణారెడ్డితోపాటు భగీరథ రెడ్డి కూడా వైసీపీలో జగన్ వెంట నడిచారు. జగన్ సారథ్యంలోని వైసీపీలో యూత్ వింగ్ కార్యకలాపాలలో భగీరథ రెడ్డి చురుకుగా పాల్గొనేవారు. అప్పటి నుంచి భగీరథరెడ్డిపై జగన్ కు ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఆ విధేయతకు ఇప్పుడు పట్టం కట్టారు. భగీరథ రెడ్డి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు. భగీరథ రెడ్డి భార్య శ్రీలక్ష్మి ప్రస్తుతం అవుకు జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  సి. రామచంద్రయ్య


  సీనియర్ పొలిటీషియన్ సి. రామచంద్రయ్య. కడప జిల్లా రాజంపేటకు చెందిన బలిజ సామాజిక వర్గం నేత. చార్టర్ అకౌంటెంట్‌గా సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో 1986-88 కాలంలో దేవదాయశాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రెండు సార్లు టీడీపీ పక్షాన రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా చంద్రబాబు టీమ్‌లో కీలకంగా మెలిగారు. కానీ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు కూడా. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సందర్భంలో చిరంజీవితోపాటు రామచంద్రయ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు 2012లో ఎమ్మెల్సీ సీటు కేటాయించింది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగాను వ్యవహరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో 2018లో వైసీపీలో చేరిన రామచంద్రయ్యకు అప్పుడే ఎమ్మెల్సీపై హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. శాసన మండలిలో టీడీపీ సీనియర్ నేతల వ్యూహాలను ధీటుగా ఎదుర్కోవాలంటే సి. రామచంద్రయ్య లాంటి వ్యక్తి ఉండడం బెటరని అధిష్టానం భావించి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల మండలి సమావేశాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూశాం. రాజధాని తరలింపు, సీఆర్ డీఎ రద్దు బిల్లులపై దుమారం రేగింది. ఆ రెండు బిల్లులను టీడీపీ నేతలు సమర్థవంతంగా అడ్డుకున్నారు కూడా. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేత యనమల ముందు వైసీపీ వ్యూహాలు పని చేయలేదు. యనమల లాంటి సీనియర్ ను ఢీ కొట్టడానికి రామచంద్రయ్యే సరైన వ్యక్తి అని జగన్ భావించి ఉండొచ్చు.

  మహమ్మద్‌ ఇక్బాల్‌  మాజీ పోలీసు అధికారి అయిన మహ్మద్ ఇక్బాల్ అనంతపురం జిల్లాకు చెందిన నేత. ఐజీ ర్యాంకు అధికారిగా ఆయన పదవీ విరమణ చేశారు. అంతకు ముందు 1999-2004 మధ్య కాలంలో చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు ఆయన భద్రతాధికారిగా వ్యవహరించారు. చంద్రబాబు సెక్యురిటీ ఆఫీసర్‌గానే ఇక్బాల్ అందరికీ తెలిసిన వ్యక్తి. పదవీ విరమణ తరువాత టీడీపీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ చేతిలో ఇక్బాల్ ఓటమి పాలయ్యారు. కానీ అస్సులు పోటీ ఉండదు అనుకోనే చోట బాలయ్యకు గట్టి పోటీ ఇచ్చారు ఇక్బాల్. అప్పుడే జగన్ ఎమ్మెల్సీపై హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌ 4, 1958న జన్మించిన షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌.. కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదివారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పూర్తి చేశారు. 1982లో నిషాత్‌ జహన్‌తో వివాహం జరిగింది. ఐపీఎస్‌కు ఎంపీక కాక ముందు ఇక్బాల్ కొంతకాలం ఇండియన్‌ రైల్వేస్ ఉద్యోగం చేశారు. ఇదివరకు ఓ దఫా ఎమ్మెల్సీగా ఇక్బాల్ వ్యవహరించారు.

  దువ్వాడ శ్రీనివాస్  గతంలో ఎవరికి పెద్దగా పరిచయం లేని దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల పంచాయతీ ఎన్నికల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆయనది శ్రీకాకుళం జిల్లా టెక్కలి. ఎంఏ ఇంగ్లీషు లిటరేచర్ చదివిన శ్రీనివాస్ ఆ తరువాత లాయర్ పట్టా కూడా పుచ్చుకున్నారు. వ్యాపారవేత్తగా కొనసాగి ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ప్రజారాజ్యం తరపున టెక్కలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్.. మూడు స్థానంలో నిలిచారు. 2009 తర్వాత నెలకొన్ని రాజకీయ పరిణామాలలో వైసీపీలలో చేరారు. 2014 ఎన్నికల్లో దువ్వాడ టెక్కలి నుంచి పోటీ చేశారు. 72 వేలకు పైగా ఓట్లు సాధించినప్పటికీ ఓటమి పాలయ్యారు. 2019లో దువ్వాడకు ఎంపీగా పోటీ చేసే అవకాశమిచ్చారు. కాని 5 లక్షల 27 వేలకు పైగా ఓట్లు సాధించినప్పటికీ.. బొటాబొటీ మెజారిటీతో కింజారపు రామ్మోహన్ నాయుడు గెలిచారు. అయితే దువ్వాడపై 13కు పైగా క్రిమినల్ కేసులున్నాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో దువ్వాడ చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. 40 ఏళ్లకుపైగా ఎన్నిక అంటే ఏంటో తెలియన అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో పట్టుపట్టి ఎన్నిక జరిగేలా చూశారు. టీడీపీ మద్దతు దారుని ఓడించడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. వీధిలోనే కర్రలు పట్టుకుని తిరిగిన వీడియోలు కూడా హైలైట్ అయ్యాయి. మరోవైపు అచ్చెన్నాయుడ్ని జైలుకు పంపించగలిగారు. అయినా అచ్చెన్నాయుడు బలపర్చిన అభ్యర్థే నిమ్మాడలో గెలుపొందారు. అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో వైసీపీ మద్దతు దారులు గెలిచేలా చేయడంలో దువ్వాడ సక్సెస్ అయ్యారు. వెంటనే ఎమ్మెల్సీ ఆఫర్ కొట్టేశారు.

  బల్లి కల్యాణ్ చక్రవర్తి  బల్లి కల్యాణ చక్రవర్తి దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ తనయుడు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరఫున ఎంపీగా బల్లి దుర్గా ప్రసాద్ గెలుపొందారు. 2020 సెప్టెంబర్‌లో కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో చైన్నైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు .నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన బల్లి దుర్గా ప్రసాద్ 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. 1985, 1994, 1999, 2009లో నాలుగుసార్లు గూడూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి.. తిరుపతి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి 2 లక్షల 28 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన తనయుడ్ని ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది. దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని గతంలోనే ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు. తుంగ భద్ర పుష్కరాల్లో పాల్గొనడానికి కర్నూలుకు వెళ్లే ముందు కల్యాణ చక్రవర్తి ముఖ్యమంత్రి జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీ అయ్యే మొట్టమొదటి ఎమ్మెల్సీ సీటును కళ్యాణ్‌కు ఇస్తామని అప్పుడే సిఎం హామినిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని బల్లి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  కరీమున్నిసా  విజయవాడ నగర పాలక సంస్థలో కార్పొరేటర్ గా వ్యవహరించిన మహ్మద్‌ కరీమున్నీసాకు జగన్ పెద్ద గిఫ్టే ఇచ్చారు. ఆమెను నేరుగా శాసన మండలికి పంపాలని నిర్ణయించారు. గతంలో కరీమున్నీసా విజయవాడ సెంట్రల్‌లో 56వ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేశారు. జగన్ పార్టీ పెట్టిన అప్పటి నుంచి విజయవాడలో జగన్ తో పాటు పనిచేసిన వారిలో కరీమున్నీసా కుటుంబం ఒకటి. టీడీపీ ప్రభుత్వంలో రెండు కేసులను ఎదుర్కోంది ఆమె కుటుంబం. కరీమున్నీసాకు ఐదుగురు పిల్లలు. ఆమె చిన్న కుమారుడు రహ్మతుల్లా జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. 2010 నుంచే జగన్‌తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రారంభం నుంచి పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు కరీమున్నీసా. జగన్ పాదయాత్ర చేసే సమయంలో 56వ డివిజన్‌లో ఆగారు. తాను సీఎం అయితే ఇక్కడ నుంచే ముస్లిం మహిళకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు జగన్ నిలబెట్టుకున్నారు.

  ముగ్గురు అభ్యర్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్.. విదేయతతో పాటు నియోజకవర్గాల్లో వారి పనితీరు.. సామాజిక సమీకరణాలు అన్ని లెక్కలు వేసుకునే ఆరుగుర్ని ఎంపిక చేసినట్టు అర్థమవుతోంది. అయితే ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయడం లేదని ప్రకటించిది వైసీపీ.
  Published by:Nagesh Paina
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు