news18-telugu
Updated: February 3, 2020, 12:38 PM IST
రోజా, వైఎస్ జగన్
శాసన మండలి రద్దు ఎమ్మెల్యే రోజాకు కలిసి రానుందా? మంత్రి పదవి ఆశించి, భంగపడ్డ ఆమెకు మండలి రద్దు వల్ల ఆ పదవి దక్కే అవకాశం ఉందా? అంటే రాజకీయ విశ్లేషకులు కావొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో శాసనమండలి రద్దు తీర్మానం కేంద్రం చెంతకు చేరిన సందర్భంలో కేబినెట్ మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మాత్రం మండలి రద్దుకు ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో అదే సభలో సభ్యులుగా ఉన్న మంత్రులిద్దరితో రాజీనామాలు చేయిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. అయితే మండలి రద్దు ఆలస్యం అయితే అనవసరంగా పరువు పోతుందా అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. ఏపీలో శాసనమండలి రద్దుకు అసెంబ్లీ చేసిన తీర్మానం కేంద్రానికి చేరిన నేపథ్యంలో వైసీపీకి చెందిన ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాలపై చర్చ మొదలైంది. మండలి సభ్యులుగా ఉన్న బోస్, మోపిదేవితో రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని వైసీపీ పెద్దలు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మండలి రద్దుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఇద్దరు మంత్రులు కొనసాగడం నైతికంగా సరికాదనే వాదనే దీనికి కారణం.
అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఇద్దరు మంత్రులు కూడా తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా స్పష్టం చేశారు. దీంతో తమ రాజీనామాలపై నిర్ణయాన్ని సీఎం జగన్ చేతిలోనే పెట్టినట్లయింది. అయితే ప్రభుత్వం మాత్రం మండలి సభ్యులైన మంత్రులతో రాజీనామాలు చేయిస్తే తలెత్తే పరిణామాలపై ఆరా తీస్తోంది. అటు.. వీరిద్దరు రాజీనామా చేస్తే ఎమ్మెల్యే రోజాకు పదవి దక్కే అవకాశం లేకపోలేదని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఆమెకు తొలి మంత్రివర్గంలోనే పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ, రోజాకు పదవి దక్కలేదు. ఆ తర్వాత ఆమెకు ఏపీఐఐసీ పదవిని కట్టబెట్టారు.
ఆ పదవితో ఆమె సంతృప్తి చెందకున్నా, సీఎం జగన్పై ఉన్న నమ్మకంతో ఆమె ముందుకుసాగారు. ఇప్పుడు ఇద్దరు తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తే, ఆ పదవుల్లో రోజాకు ఛాన్స్ ఉంటుందని.. సీఎం జగన్ కూడా ఆమెకు పదవి ఇవ్వడంపై దృష్టి సారిస్తారని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
February 3, 2020, 12:38 PM IST