టీడీపీని టార్గెట్ చేస్తూ... వైసీపీని ఇబ్బంది పెడుతున్న ఆ ఎమ్మెల్యే

సీఎం జగన్ సభలో ఉన్న సమయంలో ఆయన దృష్టిలో పడాలన్న తాపత్రయంతో మాత్రమే ఆయన టీడీపీ సభ్యుల్ని, విపక్ష నేత చంద్రబాబు మాటలకు అడ్డుతగులుతున్నారనే వాదన వినిపిస్తోంది.

news18-telugu
Updated: July 17, 2019, 11:02 AM IST
టీడీపీని టార్గెట్ చేస్తూ... వైసీపీని ఇబ్బంది పెడుతున్న ఆ ఎమ్మెల్యే
ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్
  • Share this:
అవకాశం వచ్చినప్పుడల్లా సీఎం జగన్ పై మితిమీరిన స్వామిభక్తి ప్రదర్శించే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. అసెంబ్లీ సమావేశాల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. సీఎం జగన్ దృష్టిలో పడేందుకేనా అన్నట్లుగా విపక్ష టీడీపీ సభ్యులపై విరుచుకుపడుతున్నారు. విపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడితే చాలు వారిపై అరుపులు, కేకలతో విమర్శలకు దిగుతున్నారు. దీంతో ఆయన్ను నియంత్రించడం స్పీకర్ తమ్మినేని సీతారాంకు కూడా కష్టసాధ్యంగా మారుతోంది.

ఏపీ శాసనసభలో అధికార వైసీపీ బలంతో పోలిస్తే టీడీపీ బలం నామమాత్రమే. సభలో వివిధ అంశాలపై జరుగుతున్న చర్చల్లో టీడీపీపై అన్నివిధాలుగా ఆధిక్యం సాధించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందులో విషయ పరిజ్ఞానంతో కాకుండా విమర్శలతో టీడీపీని టార్గెట్ చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో వైసీపీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ముందువరుసలో నిలుస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసేందుకు వీలుగా ఆయన నేరుగా వారి వద్దకే వెళ్లి కూర్చుంటున్నారు. అసెంబ్లీలో టీటీపీ సభ్యులు కూర్చుంటున్న వరుసకు పక్కనే కూర్చుని ప్రభుత్వం తరఫున ఎవరైనా మాట్లాడినప్పుడు విపక్షం స్పందిస్తే దానికి కౌంటర్లు వేస్తున్నారు.

విపక్ష టీడీపీని ఎదుర్కోవడం తప్పేమీ కాకపోయినా ఒక్కోసారి ఆయన చేసే విమర్శలు, అరుపులు, కేకలతో విరుచుకుపడుతున్న తీరు మిగతా సభ్యులకు సైతం ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ సభలో ఉన్న సమయంలో ఆయన దృష్టిలో పడాలన్న తాపత్రయంతో మాత్రమే ఆయన టీడీపీ సభ్యుల్ని, విపక్ష నేత చంద్రబాబు మాటలకు అడ్డుతగులుతున్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో పలుమార్లు కోటంరెడ్డిని స్పీకర్ వారించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. నిన్న శాసనసభలో కాపు రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతున్న సందర్భంగా కోటంరెడ్డి నేరుగా టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అత్యంత సమీపంలో వెళ్లి కూర్చున్నారు. బుచ్చయ్య చౌదరి కాపు రిజర్వేషన్లపై స్పందించేందుకు ప్రయత్నిస్తుండగా కోటంరెడ్డి పదేపదే అడ్డుతగిలారు. దీంతో ఓ దశలో కోటంరెడ్డి కావాలనే తమ పక్కన కూర్చుని ఇబ్బందిపెడుతున్నారని బుచ్చయ్య స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. కోటంరెడ్డిని వెంటనే తన స్ధానంలోకి వెళ్లి కూర్చునేలా ఆదేశాలు ఇవ్వాలని స్పీకర్ ను కోరారు.

వైసీపీలో ఇతర ఎమ్మెల్యేలు కూడా టీడీపీపై విరుచుకుపడుతున్నా.. ప్రత్యేకంగా కోటంరెడ్డి వ్యవహారశైలితో ఇటు వైసీపీకి, అటు టీడీపీకి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అదే సమయంలో స్పీకర్ తమ్మినేనికి కూడా కోటంరెడ్డి వైఖరి ఇబ్బందికరంగా మారుతోంది. కోటంరెడ్డి పదేపదే గొంతెత్తడంపై స్పీకర్ సైతం పలుమార్లు అసహనం చేస్తున్న పరిస్ధితి నిన్నటి సభలో కనిపించింది. ఇదే అంశంపై కోటంరెడ్డితో స్పీకర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. టీడీపీని టార్గెట్ చేయాలన్న ఆతృతలో సభా కార్యకలాపాలకు అడ్డు తగలొద్దని స్పీకర్ ఆయన్ను కోరినట్లు సమాచారం.(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18, సీనియర్ కరస్పాండెంట్)
First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>