Andhra Pradesh: చంద్రబాబు భార్యకు వైసీపీ ఎమ్మెల్యే సూచన

నారా భువనేశ్వరి(ఫైల్ ఫోటో)

చంద్రబాబు సతీమణికి వైసీపీ ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. తమ కుమారుడిని ఎవరికైనా చూపించాలి అంటూ సలహా ఇచ్చారు. లోకేష్ ముఖ్యమంత్రి కావడం సాధ్యమయ్యే పని కాదని సెటైర్లు వేశారు.

 • Share this:
  ఏపీ రాజకీయాల్లో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా అక్కడి కార్యకర్తలు జై ఎన్టీఆర్ నినాదాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ తతంగమంతా ఎప్పుడూ ఉండేదే.. ఎన్నికల్లో ఎప్పుడు టీడీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చినా.. జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి ఆహ్వానించాలనే డిమాండ్ వినిపిస్తూ ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ పేరుతో వైసీపీ నేతలు కూడా కామెంట్లు పెంచుతున్నారు. టీడీపీ నేతలపై సెటైర్లు వేస్తున్నారు.

  వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు అయితే నేరుగా నారా భువనేశ్వరికే సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు కూడా వదిలేసి చంద్రబాబు కుప్పంలో తిష్ట వేశారని ఆయన ఆరోపించారు. బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ బొమ్మలు పెట్టుకుని కుప్పంలో సైతం తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రచారానికి ​తీసుకెళ్లి, ఓడిన తర్వాత పక్కన పెట్టారని, చివరికి ఆయన సినిమాలు కూడా చూడవద్దని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు అంబటి. కానీ ఇప్పుడు వరుస ఎన్నికల్లో ఓటమి తరువాత ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు. తానేను పులివెందులకు నీళ్లిచ్చాను...ఇప్పుడు కుప్పానికి నీళ్లివ్వండి అనడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయని తెలుగు తమ్ముళ్లు గుర్తించాలన్నారు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ భజన ప్రారంభమైంది అన్నారు.

  పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు భారీ ఎత్తున గెలిచినా, చంద్రబాబు మాత్రం తామే గెలిచామంటూ టపాసులు కాల్చాడం చాలా విడ్డూరంగా ఉందని అంబటి విమర్శించారు. టీడీపీ ఆవిర్భాం నుంచి కంచుకోటగా ఉన్న పంచాయతీల్లో కూడా వైసీపీ జెండా రెపరెపలాడిందని గుర్తు చేశారు. చంద్రబాబు తన అడ్డా అని చెప్పుకునే కుప్పంలో టీడీపీ కేవలం 14 పంచాయతీలు మాత్రమే గెలిచిందని విమర్శించారు. రాష్ట్రమంతా ఇలానే ఉన్నా చంద్రబాబు మాత్రం ప్రజస్వామ్యం ఓడిందనడం విడ్డూరమన్నారు. నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లని చంద్రబాబుని సొంత నియోజకవర్గానికి వెళ్లేలా తమ అధినేత జగన్ చేశారని అంబటి అన్నారు. అందుకే ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఊరూరా తిరగాల్సి వచ్చిందన్నారు.

  మున్సిపల్ ఎన్నికల పేరుతో పచ్చకాగితాల మేనిఫెస్టో రిలీజ్ చేశారని.. మరి 2014లో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒక్కటన్నా అమలు చేశారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయలేని చంద్రబాబు.. అధికారంలో లేనప్పుడు హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఇక లోకేష్ పైనా తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకైనా అర్థం అవుతోందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ తనయుడి విషయంలో భువనేశ్వరి గారికి సూచన చేస్తున్నా అంటూ సెటైర్లు వేశారు. తమ కుమారుడిని ఎవరికైనా చూపించండి అంటూ సలహా ఇచ్చారు. లోకేష్ ముఖ్యమంత్రి కావడం సాధ్యమయ్యే పని కాదని.. భువనేశ్వరి అయినా గుర్తించాలన్నారు. నారావారి కుటుంబానికి మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని లోకేష్ బాబాయిని చూస్తే తెలుస్తోంది అన్నారు. ముఖ్యమంత్రుల కుమారులు అందరూ ముఖ్యమంత్రులు కాలేరు. ఐడెంటిటీ క్రైసిస్ వల్ల లోకేష్ పదవీ కాంక్షతో మాట్లాడుతున్నట్లున్నారని అంబటి ఆరోపించారు.
  Published by:Nagesh Paina
  First published: