Andhra Pradesh: చంద్రబాబు, నారాయణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది: నాలుగు వారాలే వాళ్లకు రెస్టు అంటున్న వైసీపీ

చంద్రబాబు, అమరావతి లోగో, నారాయణ

మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలు చట్టం నుంచి తప్పించుకోలేరని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వారి చట్టూ ఉచ్చు బిగిసింది అన్నారు. నాలుగు వారాల తరువాత వారు విచారణకు హాజరుకాక తప్పదన్నారు.

  • Share this:
    మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణలకు కాస్త విరామమే దొరికిందని.. త్వరలోనే వారు చుట్టూ ఉచ్చు తప్పక బిగుస్తుంది అంటున్నారు వైసీపీ నేతలు. ముఖ్యంగా దీనిపై ఫిర్యాదు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అయితే అమరావతి భూముల విషయంలో నూటికి నూరు శాతం అక్రమాలు జరిగాయంటున్నారు. బాధితుల స్టేట్మెంట్ కూడా సీఐడీ అధికారులు రికార్డు చేశారని వెల్లడించారు. భూముల కేటాయింపులో అక్రమాల కేసుపై కోర్టు నాలుగు వారాల వరకు మాత్రమే స్టే ఇచ్చిందని, చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణల చుట్టూ ఉచ్చు బిగుసుకుందని అన్నారు.

    ఫిర్యాదుదారులు, దళితులను టీడీపీ నేతలు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, భూ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రోజుకో టీడీపీ నేతల ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. చట్టాలను అతిక్రమించి చంద్రబాబు, నారాయణలు భూములతో లబ్ది పొందారని ఆయన మండిపడ్డారు. అప్పటి ఐఏఎస్ అధికారులపై ఒత్తిడి తేవడమే కాక.. మాట వినని వారిని బదిలీ చేశారని అన్నారు. తనకు అనుకూలంగా ఉంటాడని అప్పటి జేసీ చెరుకూరి శ్రీధర్ ను ఉన్నత స్థాయిలో పదవిలో నియమించుకున్నారు అని ఆయన ఆరోపించారు.

    ఎమ్మెల్యే ఆరోపణలు ఎలా ఉన్నా.. ప్రస్తుతానికి అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుపై జరుగుతున్న సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా..దానిపై విచారణ చేసిన హైకోర్టు.. స్టే విధించింది. అసైన్డ్ భూముల వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపాలని సీఐడీని న్యాయమూర్తిని కోరింది కోర్టు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని సీఐడీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. అయితే విచారణ తొలిదశలో వివరాలు చెప్పలేమని సీఐడీ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తిస్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. అయితే సీఐడీ విచారణతో ఏకీభవించని హైకోర్టు.. ఈ కేసులో స్టే విధించింది.

    అమరావతిలో దళితుల నుంచి భూములను బలవంతంగా లాక్కొని తమ బినామీలకు లబ్ధి చేకూర్చారని చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.

    ఈనెల 13న చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేయగా.. ఆయనకు నోటీసులు ఇచ్చిన సందర్భంగా అసలు విషయం బయటకి వచ్చింది. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌), (జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను ఏ2గా పేర్కొన్నారు. అలాగే కొంత మంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు పొందుపరిచిన సీఐడీ.. వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.
    Published by:Nagesh Paina
    First published: