కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుకు వ్యతిరేకంగా మరోసారి వైసీపీ కార్యకర్తలు గళమెత్తారు. ఎమ్మెల్యే వంశీ, ఆయన అనుచరుడు కొమ్మా కోటేశ్వరరావు తనను వేధిస్తున్నారంటూ వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మొగిలిచర్ల జోజిబాబు ఏకంగా ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవల గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతూనే ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఆయన.. ఎన్నికలైన తర్వాత వైసీపీకి మద్దతు పలికారు. వంశీ రాకను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు, కార్యకర్తలు తరచూ ఆయననకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు. సాక్షాత్తూ సీఎం జగన్ నచ్చజెప్పినా కార్యకర్తలు మాత్రం వినిపించుకోవడం లేదు. కేవలం అధికార దాహం, కాంట్రాక్టుల కోసమే పార్టీలో చేరారని ఆరోపిస్తున్నారు.
సంచలన ఆరోపణలు
వైసీపీ కృష్ణాజిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా ఉన్న జోజిబాబు.. వంశీ తమను వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం చేశారు. పెట్రోల్ తనపై పోసకొని నిప్పంటించుకునేందుకు యత్నించారు. సహచర నేతలు, కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు. వైసీపీ అధికారంలోకి రావడానికి పదేళ్లపాటు కృషి చేస్తే తమకు అవమానాలే ఎదురవుతున్నాయని జోజిబాబు వాపోయు. వైసీపీకి వెన్నముక అయిన దళితులను వల్లభనేని వంశీ, కొమ్మా కోట్లు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో దళితులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే వంశీ దళితులకు రావాల్సిన టెండర్లను అడ్డుకోవడంతో పాటు బిల్లులు కూడా చెల్లించవద్దని అధికారులకు ఆదేశాలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అదేంటని ప్రశ్నిస్తే దళితులకు ఎందుకు కాంట్రాక్టులను బెదిరిస్తున్నారన్నారు. పార్టీ జెండా మోసిన వారిని, గెలుపుకోసం కష్టపడిన వారికి గుర్తింపు లేదని.. దీనికంటే చావడమే మంచిదన్నారు. ఐతే దీనిపై ఎమ్మెల్యే వంశీ ఇంతవరకు స్పందించలేదు.

వల్లభనేని వంశీ
వైసీపీ నేతల ఆగ్రహం
ఐతే గన్నవరం వైసీపీ నేతలు వంశీ రాకను తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. 2019లో గన్నవరం నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనకు కేడీసీసీబీ ఛైర్మన్ పదవి ఇవ్వడంతో కొంత సైలెంట్ అయ్యారు. మొన్నామధ్య తన పుట్టినరోజు వేడుకల్లో వంశీపై విమర్శలు చేసి మళ్లీ వేడిపుట్టించారు. వీళ్లిద్దరి మధ్య సీఎం జగన్ స్వయంగా రాజీ కుదిర్చారు. మరోవైపు నియోజకవర్గానికే చెందిన వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కూడా వంశీని వ్యతిరేకిస్తున్నారు. మధ్యలో వంశీతో సఖ్యతగా ఉన్నా ఆ తర్వాత భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో వంశీ కార్యకర్తలను వేధిస్తున్నారని.. గన్నవరంలో ఉపఎన్నిక వస్తే తానే పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీలో విభేదాలను పక్కనబెట్టి వంశీతో కలిసి పనిచేయాలని సీఎం జగన్ సూచించినా ఇక్కడి నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు.
Published by:Purna Chandra
First published:December 15, 2020, 21:52 IST