news18-telugu
Updated: October 1, 2020, 11:53 AM IST
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
కాకినాడ సెజ్‌పై సీఎం జగన్ ఎప్పుడో కన్నేశారని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కోన ప్రాంతాన్ని కబళించాలన్నది వైఎస్ జగన్ 14ఏళ్ల కల అని విమర్శించారు. తన తండ్రి హయాంలో టీడీపీ దీన్ని అడ్డుకుందని సీఎం జగన్ కక్షకట్టారని అన్నారు. జగన్ సీఎం కాగానే మళ్లీ బినామీ సంస్థలతో కోనప్రాంతం కైంకర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని యనమల ఆరోపించారు. సీబీఐ ఛార్జిషీట్లలో సహ నిందితులే బినామీలుగా భూముల ఆక్రమణలు జరుగుతున్నాయని విమర్శించారు. వైఎస్ జగన్ బినామీ విజయసాయిరెడ్డి అని, విజయసాయిరెడ్డి బినామీ ఆయన అల్లుడు రోహిత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.
జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన భూమాయే, ఇప్పుడు కొడుకు పాలనలోనూ జరుగుతోందని యనమల విమర్శించారు. అప్పటి మోసం మరిచి పోకముందే, ఇప్పుడు మళ్లీ కోన రైతాంగానికి జగన్ మోసం చేస్తున్నారని అన్నారు. అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు చేతిలో బాధితులు కోన రైతాంగమే అని ఆరోపించారు. తనవి కాని భూములపై నాలుగు రెట్ల లాభం బినామీల ముసుగులో జగన్ పరమైందని యనమల మండిపడ్డారు. భూముల యజమానులైన రైతుల నోళ్లలో మట్టి కొట్టడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు.

యనమల రామకృష్ణుడు, సీఎం జగన్
రూ. 5వేల కోట్ల విలువైన కోన భూములు బినామీల పేర్లతో జగన్ హస్తగతమయ్యాయని యనమల వ్యాఖ్యానించారు. కాకినాడ సెజ్ విక్రయ లావాదేవీల లాభం రూ 4,700కోట్లలో సగం స్థానిక రైతులకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎ1, ఎ2, ఎ3 ల మధ్య బినామీ అవినీతి లావాదేవీలపై దర్యాప్తు జరపాలని.. పార్లమెంటు ఆమోదించిన కొత్త బినామీ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని కోరారు. కాకినాడ సెజ్ లో బల్క్ డ్రగ్ పరిశ్రమ పెడితే, కోనప్రాంతం కాలుష్య ప్రాంతంగా మారుతుందని అన్నారు.
Published by:
Kishore Akkaladevi
First published:
October 1, 2020, 11:53 AM IST