ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లను విమర్శించే అర్హతకు షర్మిలకు లేదన్నారు టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని. చంద్రబాబు నాయుడుపై మోసం, అవినీతి, దుర్మార్గుడు అంటూ విమర్శలు చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. ఈ పదాలు ఎవరికి వర్తిస్తాయో నిన్న గాక మొన్న పుట్టిన పిల్లాడికి కూడా తెలుసని అన్నారు. మీ అన్న 16 నెలలు జైల్లో ఎందుకున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తరతరాలుగా ఫ్యాక్షన్ కుటుంబం ఎవరిదో.. గతంలో డ్వాక్రా మహిళలు మైక్రో ఫైనాన్స్ బారినపడి చనిపోవడానికి కారణమెవరో అందరికీ తెలుసన్నారు.
చంద్రబాబు జగన్‌లా అవినీతిపరుడు కాదని.. ఒక విజన్ ఉన్న వ్యక్తి అని యామిని అన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉండే జగన్.. ఎప్పుడో పుష్కరాలకు వచ్చినట్టు వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేస్తుంటారని.. బెంగళూరులో ఉండే షర్మిల కూడా ఇప్పుడు ఊడి పడి అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అభివృద్ది గురించి, నారా లోకేశ్ మంత్రి పదవి గురించి మాట్లాడేందుకు అసలు షర్మిలకు ఉన్న అర్హతలేంటని ప్రశ్నించారు.
31 కేసుల్లో, 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి సీఎం కావాలనే ప్రయత్నాన్ని ఏవిధంగా సమర్థిస్తారని షర్మిళను ప్రశ్నించారు. జగన్ అవినీతిలో, మనీ లాండరింగ్‌లో మీకెంత ప్యాకేజీ వచ్చిందని ఎద్దేవా చేశారు. షర్మిల వ్యాఖ్యలు చూస్తుంటే.. రోజాకు, ఆమెకు పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదన్నారు. రోజాను ప్రజలు తిరస్కరిస్తే.. ఆమె తరుపున షర్మిల వకల్తా పుచ్చుకున్నట్టు ఉందని విమర్శించారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.