తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బట్టబయలయ్యాయి. పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించేందుకు వచ్చిన పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ముందే కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుంతరావు, షబ్బీర్ అలీ మధ్య వాడీవేడీగా వాగ్వాదం జరిగింది. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నేతలను ప్రొత్సహిస్తున్న వారిని మీరు వెంట పెట్టుకుని తిరుగుతున్నారని ఆజాద్‌తో వ్యాఖ్యానించారు వీహెచ్. కాంగ్రెస్ సీనియర్లను శవాలు అన్న వారిని ఎలా ప్రొత్సహిస్తారని పరోక్షంగా షబ్బీర్ తీరును తప్పుబట్టారు. దీనిపై వెంటనే స్పందించిన షబ్బీర్ అలీ... తాను ఎవరినీ అలా అనలేదని అన్నారు. అయినా వీహెచ్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.
ఇద్దరి మధ్య వివాదం పెద్దగా మారుతున్నట్టు గమనించిన ఆజాద్... ఇద్దరికీ సర్ధిచెప్పారు. దీంతో సమావేశానికి రాకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు వీహెచ్. ఇక టీ పీసీసీ మార్పు అంశాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆజాద్ ముందుకు ప్రస్తావించారు. కొంతకాలం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న వీహెచ్... తాజాగా ఆయనకు కాంగ్రెస్‌లో మద్దతు ఇస్తున్నారని భావిస్తున్న షబ్బీర్ అలీని టార్గెట్ చేశారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:November 05, 2019, 17:20 IST