news18-telugu
Updated: November 7, 2020, 8:11 PM IST
చిరాగ్ పాశ్వాన్ (Image; ANI)
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అన్నీ ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కావడానికి చాన్స్ ఉందని చెబుతున్నాయి. ఈ క్రమంలో లోక్‌జన శక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశవాన్ కీలక ప్రకటన చేశారు. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే అప్పుడు ఎల్జేపీ, ఇతరులు కీలకం కానున్నారు. దీనిపై స్పందిస్తూ తాను నితీష్ కుమార్‌కు మద్దతు ఇచ్చే చాన్సే లేదని తేల్చి చెప్పారు. అయితే, బీజేపీకి మాత్రం తాను మద్దతిస్తానని ప్రకటించారు. తాను అప్పుడూ, ఇప్పుడు, ఎప్పుడూ బీజేపీకి మద్దతుదారుడినేనని స్పష్టం చేశారు. 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న బీహార్‌లో ఎల్జేపీ 137 సీట్లలో పోటీ చేసింది. ఆ పార్టీ సింగల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెబుతున్నాయి.
లోక్‌జనశక్తి పార్టీ కేంద్రంలోని ఎన్డీయేలో భాగస్వామి. కానీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ఎన్డీయేలో కాకుండా వేరుగా పోటీ చేసింది. బీజేపీ, జేడీయూ కలసి పోటీ చేశాయి. సీట్ల కేటాయింపులో తేడాలు రావడంతో ఎల్జేపీ ఒంటరిగా బరిలో దిగింది. ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశవాన్ మొదటి నుంచి నితీష్ కుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీని పొడుగుతున్నారు. తన గుండెలు చీల్చి చూస్తే అందులో ప్రధాని మోదీ ఉంటారంటూ ఓ దశలో కవితాత్మకంగా ప్రకటించారు కూడా.
బీహార్‌లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా మళ్లీ నితీష్ కుమార్ సీఎం అవుతారని సాక్షాత్తూ హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. ప్రధాని మోదీ కూడా నితీష్ కుమార్ సారధ్యంలో డబుల్ ఇంజిన్‌తో బీహార్ దూసుకుపోతుందని అన్నారు. ఈ క్రమంలో చిరాగ్ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకవేళ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చి, జేడీయూకి తక్కువ సీట్లు వస్తే, ఆ సమయంలో ఎల్జేపీ మద్దతు అవసరం అయిన పక్షంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
TimesNow- CVoter
ఎన్డీయే - 116
మహాకూటమి - 120ఎల్జేపీ - 1
ఇతరులు - 6
Republic - Jan ki Baat
ఎన్డీయే - 91- 117
మహాకూటమి - 118-138
ఎల్జేపీ - 5-8
ఇతరులు - 3- 6
ABP-CVoter
ఎన్డీయే - 104-128
మహాకూటమి - 108-131
ఎల్జేపీ -
ఇతరులు - 4-8
Todays Chanakya
ఎన్డీయే - 34 శాతం ఓట్లు (+/- 3 శాతం)
మహాకూటమి - 44 శాతం ఓట్లు (+/- 3 శాతం)
ఎల్జేపీ -
ఇతరులు - 22శాతం ఓట్లు (+/- 3 శాతం)
TV9 Network
ఎన్డీయే - 110-120
మహాకూటమి - 115-125
ఎల్జేపీ - 3-5
ఇతరులు - 10-15
బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. 122 సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ 15 ఏళ్ల నుంచి పదవిలో ఉన్నారు. ఆయన తనకు ఇవి చివరి ఎన్నికలు అని ప్రకటించారు. బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి దశలో అక్టోబర్ 28న 71 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఆ తర్వాత రెండో దశలో నవంబర్ 3న 94 సీట్లకు, ఈరోజు మూడో దశలో 78 సీట్లకు పోలింగ్ జరిగింది. నవంబర్ 10న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 7, 2020, 7:57 PM IST