జేడీఎస్ పార్టీకి ఐదు స్థానాల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులే లేరు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల అంశం ఆ పార్టీని కలవరపెడుతోంది.
మాజీ ప్రధాని, స్వతహాగా రైతు అయిన హెచ్డీ దేవెగౌడ వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన తినగలిగినదాని కంటే ఎక్కువ నోట్లో వేసుకున్నారేమో అనే భావన రాకమానదు కర్ణాటకలో రాజకీయ పరిస్థితిని చూస్తుంటే. కర్ణాటకలో తమ పార్టీ (జేడీఎస్) తరఫున పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పు తీసుకునే పరిస్థితికి వచ్చారు. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తుల్లో భాగంగా దేవెగౌడ పార్టీకి ఎనిమిది సీట్లు ఇచ్చారు. అయితే, 28 స్థానాలున్న కర్ణాటకలో తమకు కనీసం 12 సీట్లు కావాలని జేడీఎస్ పట్టుబట్టింది. అయితే, కేవలం ఆరు జిల్లాలకే పరిమితమైన పార్టీకి అన్ని సీట్లు ఇవ్వడం వృధా అని హస్తం నేతలు వాదించారు. చివరకు రాహుల్ గాంధీ ఎనిమిది సీట్లు కేటాయించారు. అధ్యక్షుడి నిర్ణయం కావడంతో రాష్ట్ర కాంగ్రెస్ కూడా మారు మాట్లాడలేకపోయింది.
దేవెగౌడ ఎనిమిది సీట్లను సులువుగానే సాధించారు. అయితే, ఇప్పుడు అసలైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. జేడీఎస్ పార్టీకి ఐదు స్థానాల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులే లేరు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల అంశం ఆ పార్టీని కలవరపెడుతోంది. దీంతో జేడీఎస్ గుర్తు మీద పోటీ చేయడానికి నేతలు కావాలంటూ కాంగ్రెస్ తలుపుతట్టింది. లీడర్లు అప్పు కావాలనే ప్రతిపాదన తెచ్చింది. అయితే, ఆ ఐదు సీట్లు బీజేపీ చేతిలో పెట్టడానికి ఇష్టపడని కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ ప్రతిపాదనకు ఓకే చెప్పింది.
రాహుల్ గాంధీ, దేవెగౌడ
‘జేడీఎస్ పార్టీది అత్యాశ. తమది ఓ ప్రాంతానికి చెందిన పార్టీ కాదని, కర్ణాటక మొత్తం ఉన్నామని విమర్శకులకు సందేశం పంపడానికి ఎనిమిది సీట్లు అడిగారు. ఇప్పుడు సమస్యల్లో పడ్డారు. వారి ముందే మరే ఆప్షన్ లేదు. అందుకే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ వద్దకు పరిగెత్తుకొచ్చారు.’ అని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారు.
దేవేగౌడతో కుమారస్వామి(PTI Image)
బెంగళూరు నార్త్, ఉడుపి - చిక్మగళూర్, ఉత్తర కన్నడ ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉన్నాయి. ఆయా స్థానాల్లో కాంగ్రెస్ నేతలను జేడీఎస్ గుర్తు మీద పోటీ చేయించనున్నారు. బెంగళూరు నార్త్ నుంచి బీఎల్ శంకర్ జేడీఎస్ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. బెంగళూరు నార్త్ పార్లమెంట్ పరిధిలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు జేడీఎస్, ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు.
బీజేపీ, కాంగ్రెస్
ఉడుపి - చిక్మగళూర్లో కాంగ్రెస్ నేత, మంత్రి ప్రమోద్ మాధవరాజ్ను పోటీ చేయించాలని చూస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఉడుపి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఉత్తర కన్నడలో మంత్రి ఆర్వీ దేశ్‌పాండే కుమారుడు ప్రశాంత్ దేశ్‌పాండే లేదా సీనియర్ కాంగ్రెస్ నేత మార్గరెట్ అల్వా కుమారుడు నివేదిత్ అల్వాను బరిలోకి దించే ప్లాన్‌లో ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ అయిన విజయపుర నియోజకవర్గంలో కూడా జేడీఎస్‌కు అభ్యర్థి దొరకడం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది.
జేడీఎస్‌కు మరో సమస్య కూడా ఉంది. అదే పార్టీ సింబల్. పాత మైసూర్ దాటితే ఆ పార్టీ గుర్తు పెద్దగా ప్రజలకు తెలీదు. దీంతో కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గందరగోళ పడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. షిమోగాలో మాజీ ఎమ్మెల్యే మధు బంగారప్పను జేడీఎస్ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయన తాజాగా జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి 52,000 ఓట్ల తేడాతో మాజీ సీఎం యడ్యూరప్ప చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా మళ్లీ సింబల్ వల్ల సమస్య వస్తుందేమోనని నేతలు కంగారు పడుతున్నారు. ‘బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదన్న కారణంతో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌తో చేతులు కలిపింది. అయితే, దీని వల్ల దీర్ఘకాలంలో హస్తం పార్టీకి నష్టం జరుగుతుంది. జేడీఎస్‌కు కేటాయించిన ఎనిమిదింట్లో మూడుచోట్ల మినహా ఐదు చోట్ల బీజేపీ బలంగా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే నామినేషన్ వెయ్యకముందే ఓడిపోయినట్టు’ అని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఆవేదన వ్యక్తం చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.