WILL YSRCP LEADER YV SUBBA REDDY AGAIN BECOME ACTIVE IN PARTY YS JAGAN MOHAN REDDY HAS TO TAKE A CALL AK
వైసీపీలో మళ్లీ ఆయన హవా ఉంటుందా ? జగన్ బుజ్జగిస్తారా ?
వైెఎస్ జగన్మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
మొన్నటివరకు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి... మళ్లీ ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్‌ను వీడి జగన్ కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తరువాత కొద్దిమంది నేతలు ఆయనతో కలిసి ముందుకు సాగారు. ఇప్పటివరకు వారంతా ఆయనతోనే ఉన్నారు. అలాంటి వారిలో ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒకరు. జగన్‌కు సమీప బంధువైన వైవీ సుబ్బారెడ్డి కొన్ని నెలల క్రితం వరకు వైసీపీలో ప్రముఖ పాత్ర పోషించారు. పార్టీలో ఆయనే నంబర్ 2 అనే వార్తలు కూడా గతంలో వినిపించాయి. అయితే ఎన్నికలకు కొద్దివారాల ముందు జరిగిన పరిణామాలతో వైసీపీలో వైవీ సుబ్బారెడ్డి పరిస్థితి ఏమిటనే దానిపై ఆయన అనుచరుల్లో సందేహాలు నెలకొన్నాయి.
ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్టీలోకి రావడంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతోనే పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. వైవీ సుబ్బారెడ్డికి రెండోసారి ఒంగోలు ఎంపీ సీటు నిరాకరించిన జగన్... ఆయనకు ఏదో పదవిపై హామీ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదనేది వైవీ సుబ్బారెడ్డి వర్గీయల మాట. దీనికి వైసీపీ అధికారంలోకి వస్తే బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని వైసీపీ అధినేత చేసిన ప్రకటన వైవీ సుబ్బారెడ్డికి ఏ మాత్రం మింగుడుపడలేదనే వాదన ఉంది.
దీంతో అప్పటి నుంచే ఆయన లోటస్ పాండ్‌కు సైతం వైవీ సుబ్బారెడ్డి దూరంగా ఉంటున్నారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం కొన్నేళ్ల పాటు శ్రమించిన తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఏమిటని ఆయన తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు సమాచారం. మళ్లీ జగన్ పిలిస్తేనే తాను పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటానని ఆయన పలువురితో అన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీలో ఓ వెలుగు వెలిగిన వైవీ సుబ్బారెడ్డి మళ్లీ ఆ పార్టీలో హవా కొనసాగిస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.