WILL YS JAGAN GIVE POLAVARAM PROJECT WORKS TO CENTRE SB
పోలవరం ప్రాజెక్టుపై జగన్ కీలక నిర్ణయం... కేంద్రంతో సీరియస్గా చర్చలు
పోలవరం ప్రాజెక్ట్ (ఫైల్ ఫోటో)
నిన్న ఢిల్లీలో ప్రధానితో భేటీ అనంతరం మాట్లాడిన వైఎస్ జగన్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే పోలవరం ప్రాజెక్టుపై ఓ కీలక నిర్ణయం తీసుకోవాలని జగన్ ప్రభుత్వం సీరియస్ గానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం చేతుల్లోకి వెళ్లనుందా ? విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును కమిషన్లకు కక్కుర్తి పడి గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిందని ఆరోపిస్తున్న వైసీపీ.. తాము అధికారంలోకి రాగానే ఈ దిశగా నిర్ణయం తీసుకోనుందా ? దీనిపై సాధ్యాసాధ్యాలను ప్రస్తుతం కాబోయే సీఎం జగన్ తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఏపీలో సాగునీరు, తాగునీరు, విద్యుత్ కు కీలకం అవుతుందని భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా త్వరలో ఏర్పడే వైసీపీ ప్రభుత్వం అడుగులేస్తోంది.
నిన్న ఢిల్లీలో ప్రధానితో భేటీ అనంతరం మాట్లాడిన వైఎస్ జగన్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తాము కొనసాగించాలనుకోవడం లేదని, రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టర్లను మార్చి నిర్ణీత గడువులోగా పూర్తిచేయడం లేదా పూర్తిగా కేంద్రానికి అప్పగించి రివర్స్ టెండరింగ్ అమలు చేయాలని కోరేందుకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నట్లు జగన్ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే పోలవరం ప్రాజెక్టుపై ఓ కీలక నిర్ణయం తీసుకోవాలని జగన్ ప్రభుత్వం సీరియస్ గానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జలవనరులశాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు భారీగా కమిషన్లు తీసుకున్నారని వైసీపీ పలుమార్లు ఆరోపించింది. ప్రభుత్వం కాసుల కక్కుర్తి వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా నానాటికీ ఆలస్యమవుతోందని కొన్నేళ్లుగా వైసీపీ విమర్శలు చేస్తోంది. తాము అధికారంలోకి రాగానే పోలవరం నిర్మాణం జరిగిన తీరుపై ఓ శ్వేతపత్రం ప్రకటించాలని వైసీపీ యోచిస్తోంది. అనంతరం కేంద్రంతో చర్చించి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యతను కేంద్రానికి అప్పగించేందుకు జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నట్లు వైసీపీ భావిస్తోంది. ఒకటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని, సమయాన్ని, భారాన్ని కేంద్రానికి ఇవ్వడం వల్ల తాము ఇతర అభివృద్ధి పనులపై దృష్టిసారించడం, రెండోది పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కమిషన్లకు కక్కుర్తి పడ్డామని ఇన్నాళ్లుగా తాము చేస్తున్న ఆరోపణలు తిరిగి టీడీపీ తమపై చేసే అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం.
మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు ఇందిరా సాగర్ గా నామకరణం చేయాలని అప్పట్లో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్రంలోని యూపీఏ సర్కారుతో పాటు రాష్ట్రంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భావించాయి. కానీ వైఎస్ మరణం తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం మందగించింది. తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు.. కాంగ్రెస్ పై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతున్న తరుణంలో ఇందిరాసాగర్ పేరును ప్రస్తావిస్తే వ్యతిరేకత వస్తుందన్న భయంతో దాన్ని మూలనపడేసింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రానుండటంతో వైఎస్సార్ పోలవరం ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టుకు పేరు పెట్టాలన్న వాదన మొదలైంది.
కాబోయే సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఈ వాదన లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు సాధించడంతో పాటు నిర్మాణం కూడా ప్రారంభించిన వైఎస్సార్ పేరును ఈ ప్రాజెక్టుకు పెడితే బావుంటుందని బౌలశౌరి జగన్ కు సూచిస్తున్నారు. ఈ విషయంలో జగన్ కూడా సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇకపై వైఎస్సార్ పోలవరం ప్రాజెక్టుగా పేరు మారనుంది.
(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 తెలుగు, విజయవాడ సీనియర్ కరస్పాండెంట్ )
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.