ఎన్నికల్లో కొట్టుకున్నా... ఆ తరువాత ఐక్యంగా పోరాడాలి: ఉండవల్లి

ఉండవల్లి అరుణ్ కుమార్(ఫైల్ ఫోటో)

తాను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కాదని స్పష్టం చేసిన ఉండవల్లి... రాజ్యాంగ వ్యవస్థలు సక్రమంగా వ్యవహరించాలన్నదే తన అభిమతమని అన్నారు.

  • Share this:
    ఎన్నికల్లో పార్టీల పరంగా ఒకరితో ఒకరు తలపడినా... ఆ తరువాత మాత్రం రాష్ట్రం కోసం అందరూ ఒకటిగా పని చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉండవల్లి... ఏపీ విభజన రాజ్యాంగబద్ధంగా జరగలేదని వ్యాఖ్యానించారు. విభజన విషయంలో తామేమీ చేయలేకపోయినా... రాష్ట్రానికి సంబంధించిన హక్కులను సాధించుకోవడంలో మాత్రం అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆయన సూచించారు.

    తాను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కాదని స్పష్టం చేసిన ఉండవల్లి... రాజ్యాంగ వ్యవస్థలు సక్రమంగా వ్యవహరించాలన్నదే తన అభిమతమని అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల లెక్కల విషయంలో బీజేపీ, టీడీపీ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తాను అందరి అభిప్రాయాలను గౌరవిస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా... రాష్ట్ర హక్కుల కోసం పోరాడితేనే ప్రయోజనం ఉంటుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

    ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు తమ వ్యాపారాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోరనే భావన ఢిల్లీ పాలకుల్లో ఉందని... ఆ రకంగా వ్యవహరించకూడదని అన్నారు. ఈ సమావేశానికి బీజేపీ హాజరవుతోందనే కారణంగా సీపీఎం పార్టీ ప్రతినిధులు రాలేదని... టీడీపీతో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టం లేదనే కారణంగా వైసీపీ రాలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ వివరించారు. ఈ సమావేశం విజయవంతమైందని... ఇందుకు సహకరించిన నాయకులతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌కు ఉండవల్లి ధన్యవాదాలు తెలిపారు.
    First published: