Telangana News: టీఆర్ఎస్ సైతం బీజేపీని లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు జరిగే నాటికి టీఆర్ఎస్కు బలమైన ప్రత్యర్థిగా ఎదగాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
ఎన్నికల వ్యూహాలు రచించడంతో తిరుగులేని వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ ఎవరి కోసమైనా పని చేస్తే వాళ్లకు గెలుపు ఖాయమని అంతా నమ్ముతుంటారు. రాజకీయ పార్టీలకు అధికారం తెచ్చిపెట్టడంలో పీకేకు ఉన్న ట్రాక్ రికార్డ్ అలాంటిది. అయితే పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ విజయం కోసం పని చేసిన తరువాత మళ్లీ అలాంటి బాధ్యతలు తీసుకోనని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్.. సీక్రెట్‌గా మాత్రం కొన్ని పార్టీలతో కలిసి పని చేసేందుకు అంగీకరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ కూడా పీకేకు సంప్రదించిందని.. ఆయన టీఆర్ఎస్ కోసం పని చేసేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. దీనిపై అటు టీఆర్ఎస్, ఇటు పీకే టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన నేతగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేతకు కూడా ప్రశాంత్ కిశోర్ వంటి ఎన్నికల వ్యూహకర్త సాయం అవసరమైందా ? అనే చర్చ కూడా మొదలైంది.
అయితే గతంలో తన సొంత వ్యూహాలతోనే టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. ఈసారి మాత్రం మారిన పరిస్థితులను బట్టి పీకే సాయం తీసుకోవాలని డిసైడయినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. తెలంగాణలో కొన్ని నెలల నుంచి బీజేపీ బాగా పుంజుకుంటోంది. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలుపు తరువాత బీజేపీ మరింత దూకుడు పెంచింది. టీఆర్ఎస్ను ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ సైతం బీజేపీని లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు రచిస్తోంది.
తెలంగాణలో ఎన్నికలు జరిగే నాటికి టీఆర్ఎస్కు బలమైన ప్రత్యర్థిగా ఎదగాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్రం నుంచి కూడా పూర్తిస్థాయి సపోర్ట్ లభిస్తుండటంతో.. ఈసారి రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య పోరు గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి అజెండాతో ముందుకు సాగాలనే దానిపై ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకుని ఉండొచ్చనే చర్చ సాగుతోంది.
నిజానికి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించే ప్రశాంత్ కిశోర్.. ముందుగా క్షేత్రస్థాయి నుంచి అన్ని అంశాలపై పక్కాగా ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటారు. ఆ తరువాత లోటుపాట్లు సవరించుకుని గెలుపు కోసం ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై బ్లూ ఫ్రింట్ రెడీ చేస్తారు. ఆ తరువాత దాన్ని అజెండాగా మార్చి.. తాను మద్దతిచ్చే పార్టీ ఎన్నికలకు వెళ్లేలా చేస్తారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఎన్నికల కోసం అజెండాను తయారు చేసే బాధ్యతను ప్రశాంత్ కిశోర్ అండ్ టీమ్‌కు అప్పగించినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఈసారి మరింత తీవ్రంగా కృషి చేస్తున్నట్టు అర్థమవుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.