WILL TELANGANA CM KCR GOT SUCCESS IN DOWNGRADING BJP MLA ETELA RAJENDAR IN STATE POLITICS AK
KCR: ఆ నాయకుడి విషయంలో కేసీఆర్ వ్యూహం ఫలించిందా ?.. అవన్నీ కలిసొచ్చాయా ?
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
Telangana: అధికార టీఆర్ఎస్ ఎత్తులను తట్టుకుని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ సేవలను బీజేపీ హైకమాండ్ గట్టిగానే వినియోగించుకుంటుందని.. అయితే ఇందుకు సరైన సమయం రావాల్సి ఉందని బీజేపీలో పలువురు భావిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు మిగతా నేతల కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ విషయం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు బాగా తెలుసు. అందుకే కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధమైన నేతలు.. ముందుగా ఆయన ఆలోచనలు, వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇదిలా ఉంటే గత ఏడాది టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీమంత్రి ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ వ్యూహం ఫలించిందా ? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేసి టీఆర్ఎస్.. హుజూరాబాద్‌లో ఆయనను ఓడించేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక పర్వం అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ ఘన విజయం సాధించడంతో.. ఆయనను సొంత నియోజకవర్గంలో దెబ్బకొట్టాలని కేసీఆర్ వ్యూహాలు ఫలించలేదు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత తెలంగాణ రాజకీయవర్గాల్లో కొత్త టాక్ వినిపించింది. బీజేపీ తరపున ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఢీ కొడతారని.. ఆయన బీజేపీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆ తరువాత సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కేంద్రం, బీజేపీతో పాటు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను సీరియస్‌గా టార్గెట్ చేశారు. దీంతో బీజేపీలో మళ్లీ సీన్ మారిపోయింది.
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయ యుద్ధం కాస్త కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా మారిపోయింది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ బీజేపీ రాజకీయాల్లో కాస్త వెనుకబడ్డారనే వాదనలు వినిపించాయి. కేసీఆర్ వ్యూహాలకు తోడు బీజేపీలోని అంతర్గత పరిణామాలు కూడా ఈటల రాజేందర్‌కు మైనస్‌గా మారాయనే చర్చ సాగింది. బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారే కావడంతో.. ఇద్దరి మధ్య రాజకీయంగా గ్యాప్ పెరిగిందనే ప్రచారం మొదలైంది.
కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ అని కొందరు చర్చించుకుంటున్నారు. రవీందర్ సింగ్ ఎపిసోడ్ తరువాత బీజేపీలో ఈటల రాజేందర్ కొంత సైలెంట్ అయిపోయారని.. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ గురించి పెద్దగా చర్చ జరగొద్దని భావించిన సీఎం కేసీఆర్ వ్యూహం ఫలించినట్టే అనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. అయితే రాజకీయాల్లో ఆరితేరిన ఈటల రాజేందర్‌ను కూడా అంత తక్కువగా అంచనా వేయలేమని మరికొందరు భావిస్తున్నారు.
అధికార టీఆర్ఎస్ ఎత్తులను తట్టుకుని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ సేవలను బీజేపీ హైకమాండ్ గట్టిగానే వినియోగించుకుంటుందని.. అయితే ఇందుకు సరైన సమయం రావాల్సి ఉందని బీజేపీలో పలువురు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మాజీమంత్రి ఈటల రాజేందర్ ప్రభావం, ప్రాధాన్యత తగ్గించాలని ప్లాన్ చేసిన సీఎం కేసీఆర్.. ఈ విషయంలో కొంతమేర సక్సెస్ అయ్యారనే చర్చ సాగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.