హోమ్ /వార్తలు /రాజకీయం /

జేసీ దివాకర్ రెడ్డి తనతోపాటు టీడీపీని కూడా ఇరికించారా?

జేసీ దివాకర్ రెడ్డి తనతోపాటు టీడీపీని కూడా ఇరికించారా?

జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

ఎన్నికల కమిషన్ విధించిన పరిమితికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టానని జేసీ దివాకర్ రెడ్డి అంగీకరించారు కాబట్టి అక్కడ ఎన్నికలను రద్దు చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

    జేసీ దివాకర్ రెడ్డి అంటే ఎప్పుడూ ముక్కుసూటి మనిషి. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ముందు కూడా ఆయన పంచ్‌లు వేస్తారు. అయితే, ఆయన ముక్కుసూటితనం ఇప్పుడు జేసీ బ్రదర్స్‌తో పాటు టీడీపీని కూడా ఇరుకునపెట్టేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈనెల 22న మీడియాతో మాట్లాడిన సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నుంచి ఒక్కో అభ్యర్థి రూ.25 కోట్ల వరకు ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో తనకే రూ.50కోట్లు ఖర్చు అయ్యాయని నోరు జారారు. అదే ఇప్పుడు ఆయన కొంపముంచుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి రూ.28లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. ఎంపీ అభ్యర్థికి రూ.70లక్షల వరకు ఖర్చు చేసుకోవడానికి పరిమితి ఉంటుంది. అయితే, ఎన్నికల కమిషన్ విధించే పరిమితి ఒకటి, రెండు రోజులకు కూడా సరిపోదనేది చాలా మంది నేతలు, పార్టీల వాదన.


    జేసీ దివాకర్ రెడ్డి చెప్పిన విషయాల్లో చాలా వరకు నిజమే అయి ఉండవచ్చు. కానీ, జేసీ దివాకర్ రెడ్డి అధికారికంగా అంగీకరించారు కాబట్టి, అక్కడ ఎన్నికలను రద్దుచేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అనంతపురం, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఎన్నికలను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు. ప్రతిపక్ష వైసీపీ కూడా దీన్ని భుజానికి ఎత్తుకుంటే అది టీడీపీకి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.

    First published:

    Tags: Anantapur S01p19, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Election Commission of India, JC Diwakar Reddy, Lok Sabha Election 2019, Tdp

    ఉత్తమ కథలు