WILL TAKE ACTION ON NIMMAGADDA RAMESH KUMAR AP ASSEMBLY PRIVILEGE COMMITTEE CHAIRMAN KAKANI GOVARDHAN REDDY BA
Nimmagadda: నిమ్మగడ్డపై చర్యలు.. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి ప్రకటన
నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద చర్యలు తప్పవని ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీ పరిధిని దాటి, హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద చర్యలు తప్పవని ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీ పరిధిని దాటి, హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రకటించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్మణ రేఖ దాటి మాట్లాడుతున్నారంటూ ఇటీవల ఎస్ఈసీ రమేష్ కుమార్ గవర్నర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రులు ఇద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హక్కులకు భంగం కలిగించేలా ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ అయిన కాకాణి గోవర్దన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీ చర్చించింది. కానీ, నిర్ణయం తీసుకోలేదు. ఈ రోజు (ఫిబ్రవరి 7) నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్దన్ రెడ్డి.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహనిర్బంధం చేయాలన్న ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు కొట్టివేసిందన్నారు. న్యాయస్థానం తీర్పు తర్వాత ఎస్ఈసీగా నిమ్మగడ్డకు కొనసాగే అర్హత లేదన్నారు. గవర్నర్ వెంటనే ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు సంబంధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆగ్రహం కలిగించింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పరిమితికి మించి ఏకగ్రీవాలు అయ్యాయని, వాటిని హోల్డ్‌లో పెట్టాలని ఎస్ఈసీ అధికారులను ఆదేశించారు. అయితే, నిమ్మగడ్డ చెప్పినట్టు విని... ఏకగ్రీవాలను అడ్డుకున్న అధికారుల మీద చర్యలు తీసుకుంటామని, అక్రమంగా ఏకగ్రీవాలను తిరస్కరిస్తే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. దీంతో ఆగ్రహించిన నిమ్మగడ్డ మంత్రిని ఇంటికి పరిమితం చేయాలని, ఆయన మీడియాతో కూడా మాట్లాడనివ్వకుండా చూడాలని డీజీపీని ఆదేశించారు.
ఎస్ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ మీద విచారణ జరిపిన న్యాయస్థానం ఇద్దరికీ అనుకూలంగా ఉండే తీర్పు చెప్పింది. పెద్దిరెడ్డిని ఇంట్లో ఉండమనడం తప్పు అని స్పష్టం చేసిన హైకోర్టు, మంత్రి మీడియాతో మాత్రం మాట్లాడకూడదని స్పష్టం చేసింది. దీంతో ఫిబ్రవరి 21న ఎన్నికలు పూర్తయ్యే వరకు మంత్రి పెద్దిరెడ్డి మీడియా ముందు మాట్లాడడానికి వీల్లేకుండా పోయింది.
నిమ్మగడ్డ మీద అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆయన్ను కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశిస్తుందా? లేదా? పిలిస్తే ఆయన వెళ్తారా? లేదా? రాజ్యాంగబద్ధమైన పదవి, అది కూడా ఎన్నికల విధుల్లో ఉన్న ఎస్ఈసీని పిలిచి ఆయన మీద చర్యలు తీసుకునే అధికారం ప్రివిలేజ్ కమిటీకి ఉంటుందా? ఉంటే దీన్ని నిమ్మగడ్డ ఎలా కౌంటర్ చేస్తారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.