Home /News /politics /

WILL REVANTH REDDY GOT SUCCESS IN TARGETING TELANGANA CM KCR REGARDING PADDY PROCUREMENT ISSUE AK

Telangana: కేసీఆర్‌ను టార్గెట్ చేసే విషయంలో రేవంత్ రెడ్డి ప్లాన్ సక్సెస్ అవుతుందా ?

రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ ( ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ ( ఫైల్ ఫోటో)

Revanth Reddy: ఈ మొత్తం వ్యవహారాన్ని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి ముడిపెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి రైతుల దృష్టిని ఆకర్షించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారనే చర్చ సాగుతోంది.

    రాజకీయ వ్యూహాలు దిట్టగా పేరున్న కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే.. అదే స్థాయిలో వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి. ఈ విషయం కేసీఆర్ చేతిలో అనేక ఎదురుదెబ్బలు తిన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే వరి ధాన్యం విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొనసాగుతున్న రాజకీయ యుద్ధంలోకి తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. ఇందుకోసం ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్ వ్యవసాయ కేత్రంలో వరి ఎందుకు పండిస్తున్నారనే నినాదాన్ని ఎత్తుకున్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లిలోనూ రైతులతో సభ పెట్టి.. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్యనేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడే విషయంలో రేవంత్ రెడ్డి మరోసారి సక్సెస్ అయ్యారనే చర్చ జరుగుతోంది.

    యాసంగిలో రైతులు వరి పండించవద్దని కేసీఆర్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తాము పండించిన పంటను తాము ప్రభుత్వానికి కాకుండా వేరే వారికి అమ్ముకునే అవకాశం ఉంటే అలా చేయాలని సూచించింది. అయితే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపాలని పదే పదే కోరింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆరే తన ఫామ్ హౌస్‌లో వరి పండిస్తూ.. రైతులను పండించవద్దని అంటున్నారని రేవంత్ రెడ్డి అనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి ముడిపెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి రైతుల దృష్టిని ఆకర్షించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారనే చర్చ సాగుతోంది.

    తెలంగాణలోని రైతాంగంలో కొంతమంది ప్రత్యామ్నాయంపై దృష్టి పెడుతున్నా.. చాలామంది ఇప్పటికీ వరి పండించేందుకు సిద్ధపడుతున్నారనే వాదన ఉంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కేసీఆర్ వరి పండించినప్పుడు తామెందుకు వరి పండించకూడదనే వాదన రైతుల నుంచి వచ్చే అవకాశం లేకపోలేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది కూడా ఇదే. ఈ రకమైన చర్చ జరిగితే.. వరి కొనుగోలు విషయంలో టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయొచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ లేదా కేసీఆర్ వివరణ ఇచ్చే పరిస్థితిని రేవంత్ రెడ్డి కల్పించారన్న టాక్ కూడా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

    ఇవి కూడా చదవండి

    Telangana Congress: కాంగ్రెస్‌లో డీఎస్ చేరిక వాయిదా పడటానికి కారణం ఇదేనా ?

    Telangana: వచ్చే ఎన్నికల్లో పోటీకి మాజీమంత్రి ప్లాన్.. టీఆర్ఎస్ కాదంటే ఆ గుర్తుపైనే పోటీ


    తమను కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వరకు వెళ్లకుండా అడ్డుకోవడం అంటే.. కేసీఆర్ వరి విషయంలో రైతులను మోసం చేస్తున్నట్టే అని రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస పార్టీ టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి వరి కొనుగోలు అంశంపై ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తుండగా.. ఈ విషయంలో కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకు రేవంత్ రెడ్డి సరైన ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Revanth reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు