Revanth Reddy: రేవంత్ రెడ్డికి కొత్త చిక్కులు.. ముఖ్యనేతతో విభేదాలు.. ఆ సభపై ఎఫెక్ట్ ?

Revanth Reddy file photo

Revanth Reddy: రేవంత్ అధ్యక్ష పీఠం ఎక్కినప్పటి నుంచి ఆయన వెంట నడుస్తున్న మహేశ్వర్ రెడ్ది ఇటీవల జరిగిన ఆ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో అధ్యక్షుడినే నిలదీసినట్లు సమాచారం.

 • Share this:
  అడవుల జిల్లా, ఆదివాసుల ఖిల్లా అయిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం నుండి కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన దండోరా మ్రోగించేందుకు సన్నద్దమవుతుంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఆ పార్టీ నాయకురాలు, ములుగు శాసనసభ్యురాలు సీతక్క నిన్న ఇంద్రవెల్లిని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నేతలు కార్యకర్తలతో సమావేశమై పలు సూచనలు కూడా చేశారు. ఇదిలాఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు ఆ కార్యక్రమంపై ప్రభావం చూపుడుతుందేమోనన్న సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రేస్ కమిటి అధ్యక్షుడిగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కాంగ్రేస్ పార్టీ దూకుడు పెరిగింది.

  రేవంత్ సారధ్యంలో మొదటి సారిగా చేపట్టిన పార్టీ ఆందోళన కార్యక్రమానికి నిర్మల్ జిల్లా నుండి శ్రీకారం చుట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ ఇక్కడి నుండి ఆందోళనలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్ని తానై నడిపించారు. రేవంత్ అధ్యక్ష పీఠం ఎక్కినప్పటి నుంచి ఆయన వెంట నడుస్తున్న మహేశ్వర్ రెడ్ది ఇటీవల జరిగిన ఆ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో అధ్యక్షుడినే నిలదీసినట్లు సమాచారం.

  అయితే కాంగ్రెస్ పారీ దళిత, గిరిజనుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై సమరశంఖం పూరించేందుకు ఈ నెల 9వ తేదిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో దళిత, గిరిజన దండోరా సభను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రకటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు పీసీసీ అధ్యక్షుడిని కలిసిన సందర్భంలో అధ్యక్షుడు ప్రకటించారు. దీంతో ప్రేంసాగర్ రావు కూడా రంగంలోకి దిగి పార్టీ శ్రేణులతో సమావేశాలను నిర్వహిస్తూ జనాన్నీ సమీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలో పడ్డారు. ఈ సభ బాధ్యతలను కూడా ఆ నేతకు అప్పగించినట్లు చెప్పుకుంటున్నారు.

  అయితే ప్రేంసాగర్ రావుకు వ్యతిరేకవర్గమైన మహేశ్వర్ రెడ్డి కినుక వహించినట్లు తెలిసింది. తనతోగాని, పార్టీలో చర్చించకుండా అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని కొంత గుర్రుగా ఉన్నట్లు వినికిడి. ఇదే విషయమై మహేశ్వర్ రెడ్డి సమావేశంలో అధ్యక్షుడిని నిలదీయడం, కొంతమంది సీనియర్లు మహేశ్వర్ రెడ్డికి మద్దతు పలకడం, ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణగడం జరిగిపోయింది.

  అయితే జిల్లాలోని తూర్పు ప్రాంతానికి చెందిన నేతకు పశ్చిమ ప్రాంతంలో జరిగే కార్యక్రమ బాధ్యతలను అప్పగించడం గురించి కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. జిల్లాలో ఇప్పటికే ప్రేంసాగర్ రావు, మహెశ్వర్ రెడ్డి వర్గాలు ఉన్నాయి. మరోవైపు ఆదివాసి గిరిజన సంఘాలు కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి గిరిజనుల విషయంలో తమ వైఖరిని స్పష్టం చేయాలని, ఆ తర్వాతే సభ నిర్వహించాలని కోరుతున్నారు. ఆదివాసి తెగల్లోని గోండులు, లంబాడాల మధ్య పోరు కొనసాగుతోంది.

  లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే డిమాండ్ ఆదివాసి గిరిజన సంఘాలు ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. మరోవైపు 9వ తేది అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం కూడా వస్తోంది. ఈ సందర్భంగా ఆదివాసి సంఘాలు జరుపుకునే కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన దళిత గిరిజన దండోర సభ ఏవిధంగా సఫలమవుతుంది.. రేవంత్ రెడ్డి వర్సెస్ మహేశ్వర్ రెడ్డి ఎపిసోడ్ వ్యవహారం ప్రభావం ఈ సభపై ఉంటుందా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.
  Published by:Kishore Akkaladevi
  First published: