హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం అనంతరం తెలంగాణలో అందరికంటే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఉప ఎన్నికతో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సంబంధం లేకపోయినా.. ఫలితాలు వచ్చిన తరువాత మాత్రం మిగతా పార్టీల కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది కాంగ్రెస్. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చవిచూసిన కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరాలు బలంగా వినిపించాయి. అన్నింటినీ మించి మళ్లీ నిరాశలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకు తీసుకెళతారనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్తో పాటు బీజేపీతోనూ బలమైన పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బీజేపీ సైతం తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదని.. తామే తెలంగాణలో టీఆర్ఎస్కు నిజమైన ప్రత్యామ్నాయమనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో నిర్వహించిన సమీక్షలో రేవంత్ రెడ్డికి హైకమాండ్ ముఖ్యనేత వేణుగోపాల్ నుంచి పలు ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కొంతకాలంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలను నిర్వహించింది.
రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సభలకు ప్రజలకు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం హైకమాండ్‌కు పంపించిందట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గలేదని ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అయితే హుజూరాబాద్‌లో ఫలితాలు దారుణంగా రావడాన్ని ప్రస్తావించిన హైకమాండ్ ముఖ్యనేత వేణుగోపాల్.. సభలకు భారీగా జనం వస్తున్నారని రాష్ట్ర నాయకత్వం పంపించిన సమాచారాన్ని ప్రస్తావించారట. పార్టీకి ఈ స్థాయిలో ఆదరణ ఉంటే.. ఓట్లు మాత్రం ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే ఈ ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిందని.. అందుకే ఈ రకమైన ఫలితం వచ్చిందని ఆయనకు సమాధానం ఇచ్చారు. ఇక్కడితో ఈ ప్రస్తావన ముగిపోయింది.
రేవంత్ రెడ్డి ప్లాన్‌కు గండికొడుతున్న ఈటల రాజేందర్.. ఆ నేత విషయంలో..
Ghee: మీరు వాడే నెయ్యి మంచిదేనా ? కల్తీ జరిగిందో లేదో ఇలా తెలుసుకోండి
అయితే హైకమాండ్ నేత నుంచి ఎదురైన ప్రశ్నతో రేవంత్ రెడ్డి ప్లాన్ మారొచ్చనే చర్చ జరుగుతోంది. ఇకపై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలను నిర్వహించే అవకాశం ఉండదని పలువురు చర్చించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని మెరుగుపర్చకుండా.. ఈ రకమైన సభల ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదనే విషయంపై రేవంత్ రెడ్డికి క్లారిటీ వచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికపై సమీక్ష తరువాత రేవంత్ రెడ్డి నిర్ణయాల్లో మార్పులు ఉండొచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Revanth Reddy, Telangana