నిరూపిస్తే రాజీనామా చేస్తా.. టీడీపీకి ఏపీ డిప్యూటీ సీఎం సవాల్

తాను కూడా దళితుడినేనని.. అలాంటప్పుడు దళిత డాక్టర్‌కు ఎలా అన్యాయం చేస్తానని ప్రశ్నించారు. చంద్రబాబు కులరాజకీయాలతో పబ్బం గడుపుతున్నారని విరుచుకుపడ్డారు నారాయణ స్వామి.

news18-telugu
Updated: June 10, 2020, 9:19 PM IST
నిరూపిస్తే రాజీనామా చేస్తా.. టీడీపీకి ఏపీ డిప్యూటీ సీఎం సవాల్
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో డాక్టర్ సుధాకర్ వ్యవహారం మరవకముందే మరో డాక్టర్ అనితా రాణి వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దళిత వైద్యులను వైసీపీ నేతలు వేధింపులకు గురిచేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనితా రాణి ఇష్యూపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. అనితా రాణికి అన్యాయం చేశానని నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. తాను కూడా దళితుడినేనని.. అలాంటప్పుడు దళిత డాక్టర్‌కు ఎలా అన్యాయం చేస్తానని ప్రశ్నించారు. చంద్రబాబు కులరాజకీయాలతో పబ్బం గడుపుతున్నారని విరుచుకుపడ్డారు నారాయణ స్వామి.

చంద్రబాబుకు కుల రాజకీయాలు చేయడమే పని. గతంలో మాల, మాదిగలను విడగొట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నారు. నారా లోకేష్‌కు కనీస ఇంగిత జ్ఞానం లేదు. డాక్టర్ అనితా రాణి వ్యవహారంలో సీఐడీ విచారణ పూర్తయిన తర్వాత అసలు నిజాలు బయటపడతాయి. నేను తప్పు చేసి ఉంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. చంద్రబాబు నిరూపించినా తన పదవికి రాజీనామా చేస్తా. నాపై వచ్చిన ఆరోపణలను నిరూపించకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా?
నారాయణ స్వామి, ఏపీ డిప్యూటీ సీఎం


వైసీపీ నేతలపై చిత్తూరు జిల్లా పెనమూరు ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న మహిళా డాక్టర్ అనితా రాణి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కింది స్థాయి ఉద్యోగుల అవినీతిని ప్రశ్నించినందుకు వైసీపీ నేతలు, పోలీసులు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించి టీడీపీ నేత అనితకు ఆమె ఫిర్యాదు చేశారు. వారిద్దరి ఫోన్ కాల్ సంభాషణను టీడీపీ నేత నారా లోకేష్ ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. మార్చి 22న తనపై వైసీపీనేతలు దాడి చేశారని.. ఆస్పత్రి బాత్రూమ్‌లో ఉన్నప్పుడు ఫొటోలు తీశారని ఆరోపించారు అనితా రాణి. తనను బెదిరించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసి 3 నెలలవుతున్నా పట్టడించుకోవడం లేదని టీడీపీ నేత అనితతో తన గోడును వెల్లబోసుకున్నారు.

ఈ వ్యవహారంపై సీఎం జగన్ ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించారు. ఐతే సీఐడీ దర్యాప్తునకు డాక్టర్ అనితా రాణి ఒప్పుకోవడం లేదు. సీఐడీ అధికారులు అనిత ఇంటికి వెళ్లడంతో.. ఆమె తలుపులు వేసుకున్నారు. ఏపీ పోలీసులు, సీఐడీపై తనకు నమ్మకం లేదని.. ఈ ఇష్యూను సీబీఐకి అప్పగించాలని డాక్టర్ అనితా రాణి డిమాండ్ చేస్తున్నారు. ఘటన జరిగినప్పుడు న్యాయం చేయని పోలీసులు.. ఇప్పుడెలా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఐతే అసలు విచారణకు సహకరించకుండా.. ఎలా ఆరోపణలు చేస్తారని సీఐడీ అధికారులు విమర్శిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: June 10, 2020, 9:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading