ఆంధ్రప్రదేశ్ తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామని బీజేపీ-జనసేన పార్టీలు ప్రకటించాయి. తిరుపతిలో ఈసారి జనసేన అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు స్పష్టం చేశారు. ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేసి అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ మీటింగ్ లో ఇరువురు నిర్ణయించారు. పవన్ కూడా మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉమ్మడి కమిటీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఐతే బీజేపీ నేతలు ఒకడుగు ముందుకేసి తిరుపతిలో మేమే పోటీ చేస్తున్నామని ప్రకటించేశారు. కమలనాథుల తీరుతో పవన్ మాటకు బీజేపీ విలువ ఇవ్వడం లేదా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ద్వితీయ శ్రేణి నేతలు ఇలా అంటే ఫర్వాలేదు. కానీ ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడే ముందస్తు ప్రకటన చేయడంపై జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పొత్తు ధర్మం మరిచారా..?
రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు ఉమ్మడి నిర్ణయాలను ఇద్దరూ గౌరవించాలి. ఓ ఒక్కరు తొందరపడినా.., నోరు జారినా మరో పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. అసంతృప్తులకు కూడా లోటుండదు. తిరుపతి విషయంలో బీజేపీ అదే చేసింది. తొందరపాటో..? లేక వ్యూహంలో భాగమో..? తెలియదు గానీ.. తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక ప్రకటన చేశారు. జనసేన బలపర్చిన బీజేపీ అభ్యర్థికే ఓటు వేయాలని తిరుపతి ప్రజలకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు ప్రకటనతో జనసేన నేతలు షాక్ తిన్నారు.
జనసేన అసంతృప్తి
బీజేపీ నేతలు ఇలా ముందస్తుగా ప్రకటన చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఉమ్మడి కమిటీ వేయలేదు. అలాగే తిరుపతి ఉపఎన్నిక అజెండాగా ఒక్క సమావేశం కూడా జరగలేదు. జాతీయ స్థాయిలో ఎలా ఉన్నా.. రాష్ట్రంలో బీజేపీ కంటే జనసేన బలంగా ఉంది. అలాంటిది ఉపఎన్నికల్లో పోటీకి తొలి ప్రాధాన్యం జనసేనకు దక్కాలి అలా కాకుండా సొంత ప్రకటనలిచ్చుకోవడానన్ని జనసేన నేతలు తప్పుబడుతున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ గట్టిగా మాట్లాడకుంటే.. 2024లోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
ఇక బీజేపీ వ్యవహారశైలి చూస్తుంటే పవన్ కల్యాణ్ పాపులారిటీని ఉపయోగించుకొని ఏపీలో బలపడాలన్నదే కమలనాథుల వ్యూహమనేది కొంతమంది మాట. ఇప్పటికైనా పవన్ మేల్కోకుంటే మొదటికే మోసమొస్తుందని హెచ్చరిస్తున్నారు. ఉపఎన్నికల్లోనే పొత్తు ధర్మాన్ని పాటించని వారు.. అసలు పోటీ వచ్చేసరికి పాటిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. మరి తిరుపతి విషయంలో పవన్ వెనక్కి తగ్గుతాడా.? లేక పంతం నెగ్గించుకుంటాడా? అనేది వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:December 14, 2020, 19:25 IST