news18-telugu
Updated: June 6, 2019, 10:06 PM IST
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి(ఫైల్ ఫోటో)
టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కాంగ్రెస్ వర్గాలు కన్నెర్ర చేస్తున్నాయి. సీఎల్పీ వీలీనం వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైకోర్టు తీర్పును బట్టి లోక్‌పాల్‌ను కూడా ఆశ్రయిస్తామని..అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని స్పష్టంచేశారు. తెలంగాణలో రాజకీయాలను భ్రష్టుపట్టించారని కేసీఆర్‌పై ఆయన విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలన్నింటినీ ప్రజలు గమనించాలని కోరారు ఉత్తమ్.

స్పీకర్‌కు రాజ్యాంగం అత్యున్నత స్థానం కట్టబెట్టింది. కానీ ఇవాళ స్పీకర్ వ్యవహరించిన తీరు గర్హనీయం. పార్టీ మారతామని చెప్పిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఇంతకుముందే స్పీకర్‌ని కోరాం. అనర్హత పిటిషన్ ఆయన దగ్గరే ఉంది. ఐనా సీఎల్పీని ఎలా విలీనం చేస్తారు. దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఎందుకు కేసీఆర్‌కు గిట్టటం లేదు. పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ మారకుంటే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు. రేపు హైకోర్టుకు వెళుతున్నాం. 8న భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుంది.
— ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్

ఒక పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే మరోపార్టీలో చేరాలంటే శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని రాజ్యాంగంలో ఉంది. ప్రజలు ఎవరిని గెలిపించినా డబ్బుతో వారిని కొనాలని కేసీఆర్ చూస్తున్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు. రాష్ట్రంలో జరుగుతున్న వికృత చర్యలను గమనించాలి. ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం ఖునీ అవుతుంది. ఈనెల 8న 36 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట దీక్ష చేయబోతున్నాం.
— భట్టి విక్రమార్క
సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తయినట్లు అసెంబ్లీ కార్యాలయం బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో గాంధీభవన్‌లో భట్టి విక్రమార్క, వీహెచ్, షబ్బీర్ అలీ, పొన్నాలతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాలో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష ప్రజాస్వామ్యవాదులంతా మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.
Published by:
Shiva Kumar Addula
First published:
June 6, 2019, 10:04 PM IST